సూటు బూటు సార్ స‌రే…వాళ్లేరి?

సూటు బూటు వేసుకుని, న్యాయ‌కోవిధుడిని అంటూ నిత్యం ఎల్లో చాన‌ళ్ల‌లో కూచుని వైసీపీ ప్ర‌భుత్వంపై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటారు. కులాన్ని, అంబేద్క‌ర్‌ను, న్యాయ శాస్త్రాన్ని ఆయ‌నలా సొమ్ము చేసుకున్న‌, చేసుకుంటున్న నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌ని టీడీపీ…

సూటు బూటు వేసుకుని, న్యాయ‌కోవిధుడిని అంటూ నిత్యం ఎల్లో చాన‌ళ్ల‌లో కూచుని వైసీపీ ప్ర‌భుత్వంపై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటారు. కులాన్ని, అంబేద్క‌ర్‌ను, న్యాయ శాస్త్రాన్ని ఆయ‌నలా సొమ్ము చేసుకున్న‌, చేసుకుంటున్న నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌ని టీడీపీ నేత‌లు సైతం విమ‌ర్శిస్తుంటారు. రాజ‌ధాని అంశాన్ని అడ్డం పెట్టుకుని తానో పెద్ద మేధావిగా లేని  “జ‌డ‌”లు విప్పుతుంటారు. సాయంత్రం అయ్యే స‌రికి ఠంచ‌న్‌గా ఏదో ఒక ప‌చ్చ చాన‌ల్ ద‌ర్శ‌నమిచ్చే ఆ మేధావి, టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అలుపెర‌గ‌ని శ్ర‌మ చేస్తుంటారు.

తాజాగా రాజ‌ధానిలో ఆర్‌-5 జోన్ ఏర్పాటుకు వ్య‌తిరేకంగా పాద‌యాత్ర‌కు పిలుపునిచ్చారు. పాద‌యాత్ర‌కు సిద్ధ‌మైన ఆ మేధావిని ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌లో ముంద‌స్తు అరెస్ట్ చేయ‌డం రాజ‌కీయ చ‌ర్చ‌కు దారి తీసింది. నోటి కొచ్చిన‌ట్టు మాట్లాడ్డమే ఆయ‌న బ‌ల‌మ‌నే టాక్ వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీ త‌ప్ప‌, ఎలాంటి ప్ర‌జాబ‌లం లేని ఆ నాయ‌కుడు కాని నాయ‌కుడు, సూటుబూటు సార్ పాద‌యాత్ర‌కు ముందుకొస్తే, మ‌రి రానున్న ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామంటున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏం చేస్తున్న‌ట్టు?

ఇక్క‌డే అస‌లు ట్విస్ట్‌. ఆర్‌-5 జోన్ ఏర్పాటుకు వ్య‌తిరేకంగా టీడీపీ ఎలాంటి పోరాటం చేయ‌క‌పోవ‌డం వెనుక భ‌యం ఉంది. 50 వేల పైచిలుకు కుటుంబాల‌కు ఇంటి ప‌ట్టాలను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆర్‌-5 జోన్ ఏర్పాటుకు వ్య‌తిరేకంగా టీడీపీ ఆందోళ‌న చేస్తే, ఇంటి ప‌ట్టాల ల‌బ్ధిదారులకు తాను శ‌త్రువు అవుతాన‌ని టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తోంది. 

ఇలాంటి సంద‌ర్భాల్లో రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు సిద్ధంగా ఉన్న శిఖండీల‌ను టీడీపీ తెర‌ముందుకు తెచ్చింది. ఈ కోణంలోనే సూటుబూటు సార్ పాద‌యాత్ర‌, ఇత‌ర‌త్రా నేత‌ల హ‌డావుడిని గ‌మ‌నించొచ్చు.

అంద‌రి ప్ర‌యోజ‌నాల‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని బ‌లి అవుతోంది. ఆర్‌-5 జోన్‌పై టీడీపీ ఎందుకు మౌనం పాటించిందో అర్థం చేసుకోలేని స్థితిలో జ‌నం లేరు. పాద‌యాత్ర పేరుతో సంబంధం లేని వారంతా ఎందుకు ర‌చ్చ చేస్తున్నారో కూడా ప్ర‌జ‌ల‌కు తెలుసు. త‌న పేరును పేద ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా కూడా వాడుకుంటార‌ని బ‌హుశా అంబేద్క‌ర్ కూడా ఊహించి వుండ‌రు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది మ‌రి! ఎవ‌రినైనా, ఎలాగైనా వాడుకునే సూటుబూటు మేధావులు వ‌చ్చారు!