రామోజీ, టీడీపీ ప‌రువు పాయె!

ఈనాడు మీడియా గ్రూప్ అధినేత రామోజీరావు, టీడీపీ ప‌రువు మొత్తం పోయింది. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ వ్య‌వ‌హారంలో అలుపెర‌గ‌ని న్యాయ పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌తో బ‌హిరంగ చ‌ర్చ సవాల్‌ను టీడీపీ జాతీయ…

ఈనాడు మీడియా గ్రూప్ అధినేత రామోజీరావు, టీడీపీ ప‌రువు మొత్తం పోయింది. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ వ్య‌వ‌హారంలో అలుపెర‌గ‌ని న్యాయ పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌తో బ‌హిరంగ చ‌ర్చ సవాల్‌ను టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి స్వీక‌రించారు. ఈ నెల 14న హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో బ‌హిరంగ చ‌ర్చ‌కు వేదిక‌ను కూడా ఖ‌రారు చేశారు. ఈ నేప‌థ్యంలో ఉండ‌వల్లితో బ‌హిరంగ చ‌ర్చ‌కు రాలేన‌ని ఆయ‌న‌కు జీవీ సందేశం పంపిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

ఉండ‌వ‌ల్లితో బ‌హిరంగ చ‌ర్చ‌కు వెనక‌డుగు వేయ‌డంపై సోష‌ల్ మీడియా ఓ రేంజ్‌లో రామోజీని, టీడీపీని ఏకిపారేస్తోంది. ఇందులో భాగంగా జీవీరెడ్డికి కూడా నెటిజ‌న్లు చీవాట్లు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఉండ‌వ‌ల్లితో మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చ‌కు రాలేక‌పోతున్న‌ట్టు ఉండ‌వ‌ల్లికి జీవీరెడ్డి స‌మాచారం పంపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో జీవీరెడ్డిపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో సెటైర్స్ విసురుతున్నారు. ఒక‌ప్పుడు జీవీరెడ్డి కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా అన్ని చాన‌ళ్ల డిబేట్స్‌లో ప‌ద్ధ‌తిగా మాట్లాడేవార‌ని, ఇప్పుడు టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి అయిన త‌ర్వాతే చెడిపోయాడ‌ని దెప్పి పొడుస్తున్నారు. ఎల్లో మీడియా చాన‌ళ్ల చ‌ర్చ‌ల్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప, ఇలాంటి నాయ‌కులు కూడా ఇంకో పనిలో బిజీగా ఉంటారా? అంటూ నెటిజ‌న్లు చుర‌క‌లు అంటించారు.

ఉండవల్లి వాదనా పటిమను ఎదుర్కోలేనని బహిరంగంగా ఒప్పుకుని వున్నా జీవీరెడ్డికి పరువు దక్కేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 14వ తేదీ బిజీగా ఉన్నావు స‌రే, మ‌రో రోజు చ‌ర్చిస్తామ‌ని జీవీరెడ్డి ఎందుకు చెప్ప‌లేద‌ని నిల‌దీస్తున్నారు. అలాగే ఎల్లో చాన‌ళ్ల‌లో డిబేట్ల‌లో కూచోడానికి మాత్రం స‌మ‌యం వుంటుందా? అని ఆయ‌న్ను నిల‌దీస్తున్నారు. నిత్యం ప‌చ్చ చాన‌ళ్ల‌లో కూచుంటూ త‌న వాద‌న‌కు కోర‌స్ ఇచ్చే యాంక‌ర్లతో మాట్లాడ్డ‌మే డిబేట్ అనుకుని, ఉండ‌వ‌ల్లి స‌వాల్‌ను జీవీరెడ్డి పొర‌పాటున స్వీక‌రించి వుంటార‌ని కొంద‌రు చుర‌క‌లు అంటిస్తున్నారు.

నిజానికి జీవీరెడ్డి రాజ‌కీయాలు త‌ప్ప‌, ఇత‌రేత‌ర అంశాల్ని మాట్లాడర‌నే పేరుంది. కానీ ఎల్లో చాన‌ళ్ల‌లో కూచుని వాళ్ల అభిప్రాయాల్ని నెత్తికెత్తుకోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య వ‌చ్చింది. లేదంటే జీవీరెడ్డి మంచి విశ్లేష‌కుడిగా తెలుగు స‌మాజం గుర్తించేది. ఇదే సంద‌ర్భంలో రామోజీరావు అప్ర‌మ‌త్తం కావ‌డం వ‌ల్లే జీవీరెడ్డిని ఉండ‌వ‌ల్లితో చ‌ర్చ‌కు పంప‌లేద‌ని అంటున్నారు. టీడీపీ త‌న స‌మ‌స్య‌ను సొంతం చేసుకుని ఉండ‌వ‌ల్లితో చ‌ర్చించ‌డం వ‌ల్ల తాను కూడా వీకెండ్ జ‌ర్న‌లిస్టు &మీడియాధిప‌తి మాదిరిగా గ‌బ్బు ప‌డ‌తాన‌ని రామోజీ భ‌య‌ప‌డ్డార‌ని స‌మాచారం.

కొన్ని చాన‌ళ్లు జ‌ర్న‌లిజం నైతిక విలువ‌లు వ‌దిలేసి దిగంబ‌రంగా నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మార్గ‌ద‌ర్శిపై జీవీ చ‌ర్చ‌కు వెళితే, తాను కూడా ఆ చాన‌ళ్ల జ‌త క‌డ‌తార‌నే భ‌య‌మే రామోజీని వెన‌క్కి త‌గ్గేలా చేసింద‌ని స‌మాచారం. మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం త‌మ స‌మ‌స్య అని, దాని పరిష్కారం చూసుకుంటామ‌ని, ఇత‌రుల ప్ర‌మేయం వ‌ద్ద‌ని టీడీపీకి రామోజీరావు స‌మాచారం పంపిన‌ట్టు తెలిసింది. దీంతో జీవీరెడ్డి డిబేట్ నుంచి త‌ప్పించుకునేందుకు సాకులు వెతుక్కోక త‌ప్ప‌లేదు. 

ఏది ఏమైనా ఉండ‌వ‌ల్లితో జీవీరెడ్డి డిబేట్‌పై మీడియా, అన్ని రాజ‌కీయ ప‌క్షాలు కొన్ని రోజులుగా ఉత్కంఠ‌గా ఎదురు చూశాయి. ఉత్కంఠ‌కు తెరదించే రోజుకు కేవ‌లం 24 గంట‌ల ముందు జీవీరెడ్డి చేతులెత్తేసి ట్విస్ట్ ఇచ్చారు.

జీవీరెడ్డి ఇప్ప‌టికైనా గ‌మ‌నించాల్సింది ఏంటంటే… తాను చేస్తున్న‌వి డిబేట్స్ కావ‌ని, సాయంత్రం టైమ్‌పాస్ కోసం మాట్లాడుతు న్న‌ట్టు రియ‌లైజ్ అయితే ఆయ‌న‌కే మంచిది. ఎందుకంటే ప‌చ్చ చాన‌ళ్లైనా, నీలి మీడియాలోనైనా వారి రాజకీయ ఎజెండాకే చోటు వుంటుంది. అంతెందుకు, రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆ ప్రాంత ఉద్య‌మ‌కారుల‌తో ఏబీఎన్ ఎండీ చ‌ర్చ పెట్టారు. మ‌రి రాజ‌ధానిని వ్య‌తిరేకిస్తున్న ఉద్య‌మకారుల‌తో ఆయ‌న ఎందుకు మాట్లాడ‌లేదనే ప్ర‌శ్న‌కు జ‌వాబు ఉండ‌దు. దీనికి కార‌ణం వాస్త‌వాల్ని ప్ర‌జ‌ల‌కు చెప్పే ఉద్దేశం లేదు కాబ‌ట్టి. 

ఎంత‌సేపూ త‌మ అభిప్రాయాల్ని ప్ర‌జ‌ల‌పై బ‌లవంతంగా రుద్ద‌డ‌మే త‌ప్ప‌, వాస్త‌వాల‌పై చ‌ర్చించాల‌నే ధ్యాస లేదు. ఈ మాత్రం దానికి బ‌హిరంగ చ‌ర్చ‌కు స‌వాల్ అంటూ యువ నాయ‌కుడైన జీవీరెడ్డి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి చివ‌రికి బొక్క బోర్లా ప‌డ్డారు.