కస్టడీ కోలుకోవడం కష్టమేనా?

ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సినిమాపైన. ఎడిటింగ్ టేబుల్ పైనే ఈ సినిమాపై తనకు చాలా నమ్మకం కలిగిందన్నాడు. కానీ నాగచైతన్య ఆశించిన స్థాయిలో కస్టడీకి రెస్పాన్స్ రాలేదు. మరీ మఖ్యంగా, భారీ ప్రచారం చేసి…

ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సినిమాపైన. ఎడిటింగ్ టేబుల్ పైనే ఈ సినిమాపై తనకు చాలా నమ్మకం కలిగిందన్నాడు. కానీ నాగచైతన్య ఆశించిన స్థాయిలో కస్టడీకి రెస్పాన్స్ రాలేదు. మరీ మఖ్యంగా, భారీ ప్రచారం చేసి కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయాడు నాగచైతన్య.

అవును.. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలుస్తుందని భావించిన కస్టడీ, ఆ ఘనత సాధించలేకపోయింది. తొలి రోజు ఈ సినిమాకు 3 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ (గ్రాస్ – రూ. 7.4 కోట్లు) మాత్రమే వచ్చింది. ఇది నాగచైతన్య కెరీర్ బెస్ట్ కాదు.

లవ్ స్టోరీ, మజిలీ, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్. మళ్లీ వీటిలో నంబర్ వన్ స్థానం లవ్ స్టోరీ సినిమాదే. ఆ సినిమా ఓపెనింగ్స్ తో పోల్చుకుంటే.. కస్టడీకి వచ్చిన మొదటి రోజు షేర్ దాదాపు 40శాతం తక్కువ. అయితే నాగచైతన్య రీసెంట్ మూవీ థ్యాంక్యూ తో పోలిస్తే, ఈ ఓపెనింగ్ చాలా చాలా ఎక్కువ.

ఈ సంగతి పక్కనపెడితే, తాజా ఓపెనింగ్స్, ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు నాగచైతన్య మాత్రం తన సినిమాను హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పేశాడు.

ఈరోజు 'సక్సెస్ మీట్' పెట్టిన నాగచైతన్య.. ఇంకా సినిమా చూడనివారు ఎవరైనా ఉంటే, ఓపెన్ మైండ్ తో థియేటర్లకు రావాలని కోరుతున్నాడు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూస్తే తప్పకుండా నచ్చుతుందని అంటున్నాడు.