కోలీవుడ్ లో మన హీరోలకు ఎంట్రీ లేదా..?

పాన్ ఇండియా సంగతి తర్వాత, పొరుగు రాష్ట్రంలో క్రేజ్ తెచ్చుకోవడం ఇప్పుడు చాలామంది తెలుగు హీరోలకు కష్టమైపోతోంది. దాదాపు ప్రతి టాలీవుడ్ హీరో కోలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంటున్నాడు. కానీ ఈమధ్య కాలంలో…

పాన్ ఇండియా సంగతి తర్వాత, పొరుగు రాష్ట్రంలో క్రేజ్ తెచ్చుకోవడం ఇప్పుడు చాలామంది తెలుగు హీరోలకు కష్టమైపోతోంది. దాదాపు ప్రతి టాలీవుడ్ హీరో కోలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంటున్నాడు. కానీ ఈమధ్య కాలంలో కోలీవుడ్ లో క్లిక్ అయిన తెలుగు హీరో ఒక్కడూ లేడు.

తాజాగా నాగచైతన్య కస్టడీతో కోలీవుడ్ లో అడుగుపెట్టాడు. వెంకట్ ప్రభు లాంటి దర్శకుడు, ఇళయరాజా-యువన్ శంకర్ రాజా లాంటి సంగీత దర్శకుల అండతో గ్రాండ్ గా కోలీవుడ్ లోకి ఎంటరయ్యాడు. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు. తమిళనాట దాదాపు వంద థియేటర్లలో రిలీజైన కస్టడీ సినిమా ఫ్లాప్ అయింది.

చైతూ కంటే ముందు సాయితేజ్ కోలీవుడ్ లో లక్ చెక్ చేసుకొని ఫెయిల్ అయ్యాయి. విరూపాక్ష సినిమాను తమిళనాట విడుదల చేశాడు. చెన్నైలో ప్రచారం కూడా చేశాడు. కానీ తెలుగులో హిట్టయిన ఈ సినిమా తమిళనాట ఫ్లాప్ అయింది. 14 లక్షలు.. 12 లక్షలు.. 7 లక్షలు.. ఇలా వచ్చాయి రోజువారీ వసూళ్లు.

నాని కూడా దసరా సినిమాతో కోలీవుడ్ లోకి వచ్చాడు. కీర్తిసురేష్ లాంటి పుల్లింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ తమిళ్ లో దసరా ఆడలేదు. సాయితేజ్, నాగచైతన్యలానే నాని కూడా ఈ సినిమా కోసం చెన్నై వెళ్లి మరీ ప్రచారం చేశాడు, అక్కడి యాంకర్లు, యూట్యూబ్ జనాలతో రీల్స్ కూడా చేశాడు. కానీ రిజల్ట్ సున్నా.

ఇవి కోలీవుడ్ లో మన హీరోల తాజా అనుభవాలు మాత్రమే. ఇంకాస్త వెనక్కు వెళ్తే వారియర్ తో రామ్, ఇంకా వెనక్కి వెళ్తే స్పైడర్ తో మహేష్ బాబు లాంటి హీరోలు అక్కడ ఫ్లాపులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో చెన్నై ప్రమోషన్ అంటే డబ్బు పెట్టడానికి నిర్మాతలు, అంతదూరం వెళ్లి మాట్లాడ్డానికి హీరోలు కాస్త వెనకముందు ఆలోచిస్తారేమో.