బండ బూతులు కూడా ప్రేమతో తిట్టారంట!

చాలా ఏళ్ల కిందటి సంగతి. ఇంకా చెప్పాలంటే దువ్వాడ జగన్నాధమ్ (డీజే) సినిమా రిలీజ్ అయిన టైమ్ అది. ఆ టైమ్ లో హరీశ్ శంకర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది.…

చాలా ఏళ్ల కిందటి సంగతి. ఇంకా చెప్పాలంటే దువ్వాడ జగన్నాధమ్ (డీజే) సినిమా రిలీజ్ అయిన టైమ్ అది. ఆ టైమ్ లో హరీశ్ శంకర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమా, వసూళ్లలో ఏకంగా పవన్ కల్యాణ్ సినిమానే క్రాస్ చేసిందంటూ యూనిట్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. హరీష్ పై తిట్ల దండకం అందుకున్నారు.

ఆ టైమ్ లో విసుగెత్తిపోయిన హరీశ్ శంకర్, చాలా ట్విట్టర్ ఎకౌంట్లను బ్లాక్ చేశాడు. అవన్నీ దాదాపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వే. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ వాటిని అన్-బ్లాక్ చేయలేదు. హరీశ్ ను బూతులు తిట్టిన పవన్ ఫ్యాన్స్ కూడా అడగలేదు. కానీ ఇప్పుడు హరీశ్ టైమొచ్చింది.

పవన్ కల్యాణ్ తో ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీష్. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు. అది ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. అదే టైమ్ లో హరీశ్ బ్లాక్ చేసిన పవన్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హరీశ్ ను బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టారు.

“అప్పట్లో ఏదో కోపంలో తిట్టేశారు, అందరూ మనోళ్లే, మిగతా ఫ్యాన్స్ ను కూడా అన్-బ్లాక్ చేయన్నా ప్లీజ్” అనే సందేశాలు ఇప్పుడు హరీశ్ టైమ్ లైన్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై పరోక్షంగా స్పందించాడు హరీశ్.

సోషల్ మీడియాలో తనను బూతులు తిట్టిన వాళ్లను మాత్రమే బ్లాక్ చేశానని, విమర్శలకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, బూతులకు కాదని స్పష్టం చేశాడు. దీనిపై కూడా పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అప్పట్లో ప్రేమతోనే బూతులు తిట్టారని, ఇకనైనా అన్నీ మరిచిపోయి అన్-బ్లాక్ చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు.

హరీశ్ శంకర్ సమాధానం చూస్తుంటే.. అప్పట్లో బ్లాక్ చేసిన పవన్ ఫ్యాన్స్ ఎవ్వర్నీ తిరిగి అన్-బ్లాక్ చేసే ఉద్దేశం అతడికి ఏ కోశానా లేనట్టుంది. పైగా రేపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజై, ఫలితం తేడా కొడితే.. అన్-బ్లాక్ చేసిన ఎకౌంట్లే మళ్లీ బూతులు అందుకుంటాయనే భయం కూడా ఈ దర్శకుడికి ఉన్నట్టుంది.