ప‌వ‌న్ కంటే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి తోపు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కంటే క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అధ్య‌క్షుడు గాలి జనార్ద‌న్‌రెడ్డి తోపు అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని చూసి రాజ‌కీయంగా ప‌వ‌న్ ఎంతో నేర్చుకోవాల్సి వుంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సైతం…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కంటే క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అధ్య‌క్షుడు గాలి జనార్ద‌న్‌రెడ్డి తోపు అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని చూసి రాజ‌కీయంగా ప‌వ‌న్ ఎంతో నేర్చుకోవాల్సి వుంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సైతం చెబుతున్నారు. 

ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఎదురీది తాను గెల‌వ‌డంతో పాటు బీజేపీని మ‌ట్టిక‌రిపించ‌డంలో విజ‌యం సాధించార‌ని ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న‌ను క‌నీసం ప‌ది అసెంబ్లీ సీట్ల‌లో కూడా గెలిపించ‌లేద‌ని జ‌నాన్ని తూల‌నాడుతున్న ప‌వ‌న్‌కు గాలి గెలుపును చూపించి, ఆయ‌న్నెవ‌రు ఆద‌రించారు సార్ అంటూ జ‌న‌సేనానిని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి మ‌ధ్య పోలిక‌లు తెర‌పైకి తేవ‌డం విశేషం. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ అంటూ 2014లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అట్ట‌హాసంగా జ‌న‌సేన పార్టీని ప్ర‌క‌టించారు. వ‌చ్చీ రాగానే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా, టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ కూట‌మి విజ‌యం కోసం ప‌వ‌న్ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. టీడీపీ-బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత మూడున్న‌రేళ్ల‌కు కూట‌మిని ప‌వ‌న్ వీడారు.

2019 ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో క‌లిసి ప‌వ‌న్ పొత్తు కుదుర్చుకున్నారు. 130కి పైగా స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేసి, మిగిలిన సీట్ల‌ను మిత్ర‌ప‌క్షాల‌కు ఇచ్చారు. గాజువాక‌, భీమ‌వ‌రంలో ప‌వ‌న్ బరిలో నిలిచి రెండు చోట్ల ఓడిపోయారు. కేవ‌లం రాజోలులో మాత్ర‌మే జ‌న‌సేన అభ్య‌ర్థి గెలిచారు. త‌న‌ను క‌నీసం ఒక్క చోట కూడా గెలిపించ‌లేద‌ని ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌నాన్ని ఆడిపోసుకుంటున్నారు.

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి విష‌యానికి వ‌ద్దాం. బీజేపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. గ‌నుల‌ అక్ర‌మ త‌వ్వ‌కాల కేసులో ఏళ్ల పాటు జైల్లో మ‌గ్గారు. ఆ త‌ర్వాత బీజేపీకి దూరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు బ‌ళ్లారిలో అడుగు పెట్ట‌లేని ప‌రిస్థితి. గంగావ‌తిలో నివాసం. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో 2022, డిసెంబ‌ర్ నాలుగో వారంలో క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అనే కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌. ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా మూడు నెలల ముందు మాత్ర‌మే కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించి, ఉత్త‌ర క‌ర్నాట‌క‌లో 47 మంది అభ్య‌ర్థుల‌ను నిలిపి త‌న ప‌ట్టు నిలుపుకున్నారు.

తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ప్ర‌భావం గురించి క‌థ‌లుక‌థ‌లుగా మాట్లాడుకునే ప‌రిస్థితి. ఏకంగా 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఓట‌మికి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ కార‌ణ‌మైంద‌ని విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి చివ‌రి వ‌ర‌కూ పోరాడి ఓడిపోయారు. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి మాత్రం గంగావ‌తిలో గెలుపొంది శ‌భాష్ అనిపించుకున్నారు. ఎన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఇంకా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం ఆశ్చ‌ర్య‌మే. ప‌వ‌న్ మాదిరి కాకుండా పార్టీ అధ్య‌క్షుడిగా గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి విజ‌యం సాధించి శభాష్ అనిపించుకున్నారు.  

తీవ్రమైన అవినీతి ఆరోప‌ణ‌లు, సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో గంగావ‌తిని విడిచి బ‌య‌ట తిర‌గ‌లేని ప‌రిస్థితి…. అయిన‌ప్ప‌టికీ గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నార్త్ బ‌ళ్లారిలో త‌న ప్ర‌భావాన్ని చూపారు. గాలితో పోల్చితే ప‌వ‌న్‌కు ల‌క్ష‌ల రెట్లు అనుకూల ప‌రిస్థితులున్నాయి. 15 శాతం ఓటు బ్యాంక్ ఉన్న కులం ఆయ‌న సొంతం. అవినీతి మ‌చ్చ‌లేని జీవితం. ఆ రెండు సామాజిక వ‌ర్గాల నాయ‌క‌త్వానికి విసిగిపోయి, కొత్త నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్న ప్ర‌జాకాంక్ష‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు ప‌వ‌న్‌కు క‌లిసొచ్చే అంశాలు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ రాజ‌కీయంగా ఫెయిల్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న‌లో ప‌ట్టుద‌ల లేక‌పోవ‌డం, చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోసే నేత‌గా ముద్ర ప‌డ‌డం. 

ఈ కార‌ణాల వ‌ల్లే చివ‌రికి సొంత సామాజిక వ‌ర్గం ఆద‌ర‌ణ కూడా ప‌వ‌న్ పొంద‌లేక‌పోయారు. ప‌దేప‌దే త‌న‌ను గెలిపించ‌లేద‌ని వాపోతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య విజ‌యం సాధించిన గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నుంచి ఎంతైనా నేర్చుకోవ‌చ్చు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూద్దాం.