క‌న్న‌డ విజేత‌ల్లో 9 మంది రెడ్లు!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో య‌థావిధిగా తెలుగు మూలాలున్న వాళ్లు స‌త్తా చాటారు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల ఏర్పాటు స‌మ‌యంలో తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత క‌ర్ణాట‌క‌లో క‌లిసినందు వ‌ల్ల మొద‌లైన తెలుగు వారి…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో య‌థావిధిగా తెలుగు మూలాలున్న వాళ్లు స‌త్తా చాటారు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల ఏర్పాటు స‌మ‌యంలో తెలుగు మాట్లాడే ప్రాంతం కొంత క‌ర్ణాట‌క‌లో క‌లిసినందు వ‌ల్ల మొద‌లైన తెలుగు వారి రాజ‌కీయం ఇప్ప‌టికీ అక్క‌డ కొన‌సాగుతూ ఉంది. ప్ర‌త్యేకంగా తెలుగు అంటూ కూట‌మి ఏమీ లేక‌పోయినా.. అన్ని పార్టీల త‌ర‌ఫునా తెలుగు వారు, తెలుగు మూలాలున్న న‌యాత‌రం నేత‌లు అక్క‌డ స‌త్తా చూపిస్తూ ఉన్నారు. 

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడ‌ల్లా తెలుగు మూలాలున్న వారి రాజ‌కీయం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ సారి కర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగు మూలాలున్న వారు డ‌జ‌ను మందికిపైనే గెలిచారు. హైద‌రాబాద్ క‌ర్ణాట‌క‌, మ‌ద్రాస్ స్టేట్ నుంచి క‌ర్ణాట‌క‌లో క‌లిసిన తెలుగు ప్రాంతంలో తెలుగు మూలాలున్న నేత‌ల విజ‌యాలు న‌మోద‌య్యాయి. అలాగే బెంగ‌ళూరు సిటీ ప‌రిధిలో కూడా తెలుగు నేప‌థ్యం ఉన్న వారు ఎమ్మెల్యేల‌య్యారు.

బెంగ‌ళూరు సిటీ విష‌యానికి వ‌స్తే.. బీటీఎం లేఔట్ నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ హోంమంత్రి రామ‌లింగారెడ్డి మ‌రోసారి విజ‌యం సాధించారు. బ‌ళ్లారి నుంచి బెంగ‌ళూరు వెళ్లి సెటిలైన తెలుగు కుటుంబం రామ‌లింగారెడ్డిది.  న‌గ‌రం న‌డిబొడ్డున రాజ‌కీయంగా ఈయ‌న హ‌వా కొన‌సాగుతూ ఉంది. ఈయ‌న కూతురు సౌమ్యారెడ్డి జ‌య‌న‌గ‌ర నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆమెకు ఇది వ‌ర‌స‌గా రెండో ప‌ర్యాయం విజ‌యం. 

ఇక బీటీఎం లేఔట్ కు ప‌క్క‌నే ఉండే బొమ్మ‌న‌హ‌ళ్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి స‌తీష్ రెడ్డి మ‌రోసారి విజ‌యం సాధించారు. తెలుగు కార్మికులు, క‌ర్ష‌కులు పెద్ద ఎత్తున ఉండే ప్రాంతం బొమ్మ‌న‌హ‌ళ్లి. ఇక్క‌డ నుంచి స‌తీష్ రెడ్డి మ‌రో ద‌ఫా నెగ్గారు. ఇక తెలుగు సెటిల‌ర్లు, వ‌ల‌స జీవులు ఎక్కువ‌గా ఉండే య‌ల‌హంక నుంచి బీజేపీ త‌ర‌ఫున విశ్వ‌నాథ గెలిచారు. ఈయ‌న‌ది కూడా తెలుగు రెడ్డి కుటుంబ‌మే.

బ‌ళ్లారిలో ఎవ‌రు నెగ్గినా తెలుగు నేప‌థ్య‌మే. ఈ సారి ఆ అవ‌కాశం కాంగ్రెస్ అభ్య‌ర్థి భ‌ర‌త్ రెడ్డికి ద‌క్కింది. గాలి సోమ‌శేఖ‌ర రెడ్డి, గాలి ల‌క్ష్మి అరుణ ఓడిపోయారు. వీరి మ‌ధ్య‌న ఓట్ల చీలిక భ‌ర‌త్ కు సానుకూలంగా నిలిచింది. గంగావ‌తి నుంచి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు.

జేడీఎస్ త‌ర‌ఫు నుంచి శ్రీనివాస‌న‌గ‌ర నుంచి వెంక‌ట‌శివారెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి ఓడిపోయారు.  ఈయ‌న‌ది కూడా తెలుగు కుటుంబ నేప‌థ్యమే. చ‌క్క‌గా తెలుగు మాట్లాడ‌తారు కూడా. ఇక బాగేప‌ల్లి నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సుబ్బారెడ్డి మ‌రోసారి విజ‌యం సాధించారు. 

ఇలా క‌ర్ణాట‌క అసెంబ్లీలో తెలుగు మూలాలున్న డ‌జ‌ను మందికి పైనే అధ్య‌క్ష‌.. అన‌బోతున్నారు మరోసారి. అలాగే జ‌నాభా శాతం చాలా త‌క్కువే అయినా, ఏపీ- తెలంగాణ అసెంబ్లీల‌కు తీసిపోకుండా క‌ర్ణాట‌క అసెంబ్లీలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం ప్రాతినిథ్యాన్ని కొన‌సాగిస్తోంది!