యూట్యూబ్ వ్యూస్ కోసం విమానం కూల్చేశాడు

నవంబర్ 26, 2021… 29 ఏళ్ల ట్రెవర్ డేనియల్ జాకబ్ ఓ తేలికపాటి విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. అతడికి పైలెట్ లైసెన్స్ ఉంది. విమానంలో కాలిఫోర్నియాలోని లాంపోక్ సిటీ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాడు.…

నవంబర్ 26, 2021… 29 ఏళ్ల ట్రెవర్ డేనియల్ జాకబ్ ఓ తేలికపాటి విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. అతడికి పైలెట్ లైసెన్స్ ఉంది. విమానంలో కాలిఫోర్నియాలోని లాంపోక్ సిటీ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాడు. మామూత్ లేక్స్ కు వెళ్తున్నట్టు సమాచారం అందించాడు. విమానం టేకాఫ్ అయింది, 35 నిమిషాల ప్రయాణం సాగింది. లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్ పై నుంచి విమానం ఎగురుతోంది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే కమాండ్ కంట్రోల్ ను సంప్రదించాడు జాకబ్. వాళ్లు కొన్ని సూచనలు చేశారు, ఏం చేయాలో చెప్పారు. కానీ అవేవీ పనిచేయలేదు. ఇక ఆఖరి ప్రయత్నంలో భాగంగా విమానం నుంచి దూకేస్తున్నట్టు సమాచారం అందించాడు జాకబ్. ఆ వెంటనే దూకేశాడు కూడా.

అలా ఆ తేలకపాటి విమానం పాడ్రెస్ అడవుల్లో కుప్పకూలింది. పారాచూట్ సహాయంతో కిందకు దిగిన జాకబ్ ను, స్థానిక రైతులు కాపాడారు. జాకబ్ బాగా అలసిపోయాడు, దగ్గర్లోని చెరువు వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. ఈ దృశ్యాలన్నీ అతడు తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడు.

మరోవైపు జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దృష్టిపెట్టారు. లోతుగా విచారణ సాగిస్తే, వాళ్లకు విస్తుగొలిపే వాస్తవం బయటపడింది. కేవలం యూట్యూబ్ లో వ్యూస్, క్లిక్స్ కోసం.. జాకబ్ ఇలా విమానాన్ని కూల్చేశాడు. ఆ వీడియోల్ని తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడు. లైవ్ లో విమానం క్రాష్ అనగానే మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి.

తను ఆడిన నాటకం బయటపడ్డంతో జాకబ్ తప్పు ఒప్పుకున్నాడు. కేవలం వ్యూస్ కోసమే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు అబద్ధమాడి, కూలిపోయినట్టు చేశానని అంగీకరించాడు. ఈ కేసుపై తాజాగా తీర్పు వెలువడింది. కోర్టు అతడి పైలెట్ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాదు, ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.