ఫుట్‌బాల్ ఆడుకున్న గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి!

క‌ర్నాట‌క‌లో బీజేపీని ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అధ్య‌క్షుడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడుకున్నారు. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మికి జ‌నార్ద‌న్‌రెడ్డి వ్య‌తిరేక గాలి కూడా తోడైంది.…

క‌ర్నాట‌క‌లో బీజేపీని ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అధ్య‌క్షుడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడుకున్నారు. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మికి జ‌నార్ద‌న్‌రెడ్డి వ్య‌తిరేక గాలి కూడా తోడైంది. ఉత్త‌ర క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ హ‌వాకు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి గ‌ణ‌నీయంగా బీజేపీ ఓట్ల‌ను చీల్చ‌డ‌మే కార‌ణ‌మైంది. ఉత్త‌ర క‌ర్నాట‌క‌లో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి సార‌థ్యంలోని క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష పార్టీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేసింది. గాలి పార్టీ గుర్తు ఫుట్‌బాల్ కావ‌డం విశేషం.

దాదాపు 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ బీజేపీ కంటే మెరుగ్గా, కొన్ని చోట్ల పోటాపోటీగా ఓట్లు సాధించింది. దీంతో బీజేపీ ఓట్లను జ‌నార్ద‌న్‌రెడ్డి బాగా చీల్చిన‌ట్టైంది. బళ్లారిలో అడుగు పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశించడంతో  గంగావతిలో జ‌నార్ద‌న్‌రెడ్డి నివాసం ఏర్ప‌ర‌చుకున్నారు. అక్క‌డి నుంచే బ‌రిలో దిగారు. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ పార్టీల అభ్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించి జ‌నార్ద‌న్‌రెడ్డి విజ‌యం సాధించ‌డం విశేషం.

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి భార్య లక్ష్మీ అరుణ మాత్రం బళ్లారి నుంచి బ‌రిలో దిగారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి నారా భ‌ర‌త్‌రెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చి చివ‌రికి ఓడిపోయారు. దాదాపు 8 ఏళ్ల ప్రవాసం తర్వాత‌ మళ్లీ సొంత పార్టీతో ముందుకొచ్చిన జ‌నార్ద‌న్‌రెడ్డి తనను అందరూ ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారనీ, తాను కూడా అదే ఆట ఆడుకుంటానని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. అత‌ను స‌వాల్ విసిరిన‌ట్టే బీజేపీని ఫుట్‌బాల్ ఆడుకున్నారు.  

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ బ‌రిలో ఉండ‌డం వ‌ల్లే ఆయ‌న ఆత్మీయుడు శ్రీ‌రాములు, సొంత సోద‌రుడు సోమ‌శేఖ‌ర‌రెడ్డి త‌దిత‌ర బీజేపీ నేత‌లంతా ఓడిపోయారు. త‌న పార్టీ గెల‌వ‌లేకపోయినా, త‌న‌ను అవ‌మానించిన బీజేపీని ఓడించ‌డంతో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టైంది.