ఆంధ్రలో మళ్లీ మొదలు

నవ్వి పోదురు కాక..మాకేటి..మా ఇష్టం అన్నట్లు వుంది ఆంధ్రలో పరిస్థితి. సినిమా టికెట్ ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా పట్ల ఆంధ్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది.  Advertisement…

నవ్వి పోదురు కాక..మాకేటి..మా ఇష్టం అన్నట్లు వుంది ఆంధ్రలో పరిస్థితి. సినిమా టికెట్ ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా పట్ల ఆంధ్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. 

టికెట్ రేట్ల అమలు, నిబంధనల అమలు విషయంలో గట్టిగా పట్టుకుంది. ఎన్నడూ లేనంతగా రెవెన్యూ శాఖ సిబ్బందిని మోహరించింది. ఆ తరువాత అంతా సర్దు మణిగింది. ఆ తరువాత విడుదలయిన సినిమాలను పట్టించుకోవడం మానేసారు. దాంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. 

సినిమాలు చకచకా విడుదలవుతున్నాయి. పండగకు కానీ ఆ తరువాత కానీ విడుదలయిన సినిమాలపై ఆంక్షలు ఏవీ విధించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కత్తిని బయటకు తీసారు. 

భీమ్లా నాయక్ సినిమాకు అదనపు ఆటలు వేయకూడదు, అదనపు రేట్లు అమ్మకూడదు అంటూ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసారు. కలెక్టర్ల నుంచి ఎమ్మార్వోలకు, ఎమ్మార్వోల నుంచి వీఆర్వోలకు మౌఖికంగా ఆదేశాలు రావడంతో, థియేటర్ యజ‌మానులకు కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ఏరియాకు 40 కోట్ల మేరకు భీమ్లా నాయక్ సినిమాను విక్రయించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏం జ‌రుగుతుందో అని బయ్యర్లు దిగులు చెందుతున్నారు. ఈ సాయంత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సభ వుంది. మరి ఈ విషయం మీద పవన్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.