క్లారిటీ లేకపోతే కేసీఆర్ లక్ష్యం నెరవేరదు

బీజేపీ వ్యతిరేక కూటమి తయారు చేయాలనే కేసీఆర్ ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు కొందరు. మెచ్చుకోవాలి కూడా. పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇదివరకు థర్డ్ ఫ్రంట్ పెడతానని నినదించారు. కొన్ని రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళను వీళ్ళను…

బీజేపీ వ్యతిరేక కూటమి తయారు చేయాలనే కేసీఆర్ ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు కొందరు. మెచ్చుకోవాలి కూడా. పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇదివరకు థర్డ్ ఫ్రంట్ పెడతానని నినదించారు. కొన్ని రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళను వీళ్ళను కలిశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ రంగంలోకి దిగారు.

కొంతకాలంగా బీజేపీని, మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఆకర్షించారు. జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం అండ్ లక్ష్యం కూడా. కానీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడాలంటే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలనేది మిగతా ప్రాంతీయ పార్టీల ఉద్దేశం.

ఈ విషయంలో వాటికి క్లారిటీ ఉంది. కాంగ్రెస్ దారి కాంగ్రెస్ దే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటోంది గానీ కొన్ని పార్టీలు ఆ విషయాన్ని ఒప్పుకోవడంలేదు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని శివసేన స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుత మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అది భాగస్వామి. కాంగ్రెస్ ను కలుపుకొని పోకుండా శివసేన బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరే అవకాశం లేదు.

బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ కు చోటు ఉండాల్సిందేనని శివసేన కుండ బద్దలు కొడుతోంది. కేసీఆర్ – ఉద్దవ్ ఠాక్రే జరిపిన చర్చల్లో కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు చేయడమనే మాటే రాలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. కొత్త కూటమిలో కాంగ్రెస్ ఉండాల్సిందేనని మమతా బెనర్జీకి కూడా చెప్పమని అన్నారు. సంజ‌య్ రౌత్ నుంచి వ‌చ్చిన ఈ స్టేట్‌మెంట్ కేసీఆర్‌కు ఇబ్బందిక‌ర‌మే.

గులాబీ బాస్‌.. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌పై ఏక‌కాలంలో పోరాడాల‌ని చూస్తున్నారు. ఇన్నేళ్ల దేశ దుస్థితికి ఆ రెండు పార్టీలే కార‌ణ‌మంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకే, బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ, కేసీఆర్ ఎక్క‌డికి వెళితే అక్క‌డ‌.. ఆయ‌న‌కు జై కాంగ్రెస్ స్లోగ‌న్సే వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా, ముంబై ప‌ర్య‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది.

శివ‌సేన కానీ, ఎన్సీపీ కానీ.. కాంగ్రెస్ లేని కూట‌మికి తాము వ్య‌తిరేక‌మ‌ని తేల్చి చెబుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా ప్రత్యర్థే. తెలంగాణాలో అనుసరించే విధానాన్నే జాతీయ రాజకీయాలలో, కొత్త కూటమి ఏర్పాటులోనూ అనుసరిస్తానని కేసీఆర్ అనుకుంటే కుదరదు. దేశ రాజ‌కీయాల‌ను చూస్తే కాంగ్రెస్‌తో ఎలా వ్యవ‌హ‌రించాల‌న్నది పెద్ద స‌మ‌స్యగా మారింది. నాయ‌క‌త్వ లోపం ఆ పార్టీని వేధిస్తోంది.

రాజ‌కీయంగా ఆ పార్టీ ప్రభావం చూప‌డం లేద‌న్నది కేసీఆర్ భావ‌న‌. తెలంగాణ‌లో అయితే ఆ పార్టీతో యుద్ధమే చేస్తున్నారు. ప్రధాన ప్రతిప‌క్షంగా భావించి పోరాటం చేస్తున్నారు. థాకరే, ప‌వార్‌ల ప‌రిస్థితి వేరు. వారు కాంగ్రెస్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ప్రంట్‌లో కాంగ్రెస్ ఉండాల‌న్న‌దే వారి అభిమ‌తం. అందువ‌ల్ల కాంగ్రెస్ తో క‌లిసి ఉండే ఫ్రంటా? లేని ఫ్రంటా అన్నదానిపై కేసీఆర్ కు  క్లారిటీ రావాల్సి ఉంది.

దీని మాట ఎలా ఉన్నా కేసీఆర్ మాత్రం ప్రయ‌త్నాల‌ను ఆపేలా లేరు. అందులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడ‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ల‌తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదనేది స్టాలిన్ అభిప్రాయం కూడా. మ‌హారాష్ట్ర అనే కాదు.. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లోనూ సేమ్ సీన్‌. కేసీఆర్‌-స్టాలిన్‌ల భేటీలోనూ ఇదే ప్ర‌స్తావ‌న‌. కాంగ్రెస్ ర‌హిత కూట‌మికి తామంత ఇంట్రెస్టెడ్ కాద‌ని స్టాలిన్ సైతం సెల‌విచ్చారు.

చేసేది లేక కేసీఆర్ తిరిగొచ్చేశారు. ఒక్క బెంగాల్ దీదీ మ‌మ‌తా బెన‌ర్జీ ఒక్క‌రే.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ అంటూ కేసీఆర్‌కు కోర‌స్ క‌లుపుతున్నారు. కుదిరితే.. తానే ప్ర‌ధాని పీఠంపై కూర్చోవాల‌నేది ఆమె ప్ర‌య‌త్నం. కేసీఆర్ క‌లుస్తున్న నేత‌లంతా కాంగ్రెస్‌తో స‌ఖ్య‌త‌గా ఉంటున్న‌వారే.  కాబట్టి తదుపరి చర్చలు జరపబోయే ముందు కాంగ్రెస్ పై కేసీఆర్ క్లారిటీ తెచ్చుకోవాలి. 

కొత్త కూటమి కాంగ్రెస్ లేకుండా ఏర్పాటు చేస్తామంటే కుదరదు. రాష్ట్రంలో కేసీఆర్ కు కాంగ్రెస్ అంటే పడకపోవచ్చు. కానీ బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడం తన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ ను కలుపుకు పోవాల్సిందే. కాంగ్రెస్ అక్కరలేదని కేసీఆర్ మొండిగా ఉంటే మాత్రం కూటమి సాకారమయ్యే అవకాశం లేదు.