తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అడగడానికి సిగ్గనిపించడం లేదా? అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది. 1989 నుంచి కుప్పం వరుస విజయాలను అందిస్తున్నా, ఎప్పుడూ ఆ ప్రాంతానికి న్యాయం చేద్దామన్న ఆలోచన లేదనడానికి తాజాగా ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖ నిదర్శనం.
జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో కుప్పం రెవెన్యూ డివిజన్ గురించి చంద్రబాబుకు ఆలోచన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిత్తూరు కలెక్టర్‌కు చంద్రబాబు తాజాగా ఒక లేఖ రాశారు. జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతమైన కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా చిత్తూరు కలెక్టర్‌కు లేఖ రాశారు. అంతేకాదు, రెవెన్యూ డివిజన్ కావాలనేది స్థానిక ప్రజల ఆకాంక్షగా ఆయన పేర్కొనడం గమనార్హం.
కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనేది సెంటిమెంటుగా కూడా రూపుదిద్దుకుందని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కడా ఏర్పాటు, దానికి ఆర్డీవో స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికైనా స్థానిక ప్రజల ఆకాంక్షలను, సెంటిమెంటును, సమస్య లను దృష్టిలో ఉంచుకుని కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
1983లో కాంగ్రెస్ తరపున చంద్రగిరిలో ఓటమి తర్వాత ఆయన కుప్పానికి మకాం మార్చారు. 1989 నుంచి వరుసగా ఏడు దఫాలు అక్కడి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసినప్పుడు కుప్పానికి ఏదైనా చేయాలని ఆయనకు గుర్తు రాలేదు. అలాగే 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు కూడా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని గుర్తు రాలేదు.
ఇప్పుడు జగన్ పాలనలో మాత్రం ఆయనకు కుప్పం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, సెంటిమెంటు, సమస్యలు ఇలా అన్నీ గుర్తుకొస్తున్నాయి. కుప్పం నియోజకవర్గ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు ఓడించారో బహుశా చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందేమో.
కుప్పం ప్రజల ఆకాంక్షలు, సెంటిమెంటును నెరవేర్చాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత అక్కడి ప్రజాప్రతినిధిగా తనపై ఉందనేది విస్మరించడం వల్లే… నేడు అక్కడ పార్టీ ఘోర ఓటమికి కారణమని తెలుసుకుంటే మంచిది. అధికారంలో ఉండగా సొంత నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేక, ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలను జగన్ ప్రభుత్వం ముందు ఉంచడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు అని ప్రశ్నించే వాళ్లకు ఆయన ఏం సమాధానం ఇస్తారు?