మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సందర్భంగా ట్విస్టుల మీద ట్విస్టులు. సీబీఐ విచారణ ట్వంటీ20 మ్యాచ్ కంటే ఎక్కువ ఉత్కంఠ కలిగిస్తోంది. నిందితులు వర్సెస్ సీబీఐ అనే రీతిలో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను మానసికంగా, శారీరకంగా సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్ వేధిస్తున్నారని పులివెందుల నివాసి గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప కోర్టులో పిటిషన్ వేశారు.
అక్కడ పిటిషనర్‌కు సానుకూల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణాధికారిపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా సీబీఐ విచారణాధికారినే టార్గెట్ చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో తనపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రామ్‌సింగ్ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణాధికారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో సీబీఐ విచారణాధికారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా వుండగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పిటిషన్ వెనుక నిందితుల మైండ్ గేమ్ దాగి ఉందని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఉదయ్‌కుమార్‌రెడ్డి వెనుక అదృశ్య శక్తులు తమను నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవాలనే కుట్రలకు తెరలేపినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారని సమాచారం.
ఏకంగా తమపైన్నే కడప పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి సీబీఐ విచారణ ఏ విధంగా సాగుతుందోననే ఉత్కంఠ మాత్రం నెలకుంది. ఇదిలా ఉండగా సీబీఐ విచారణాధికారిపైన్నే కేసు నమోదు చేయించామనే ఆనందం కనీసం 24 గంటలు కూడా లేకుండా పోయిందనే చర్చ హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జరగడం గమనార్హం.