తమిళ నటుడు కార్తీ 15 యేళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. ఇతడి తొలిసినిమా 'పరుత్తివీరన్' విడుదలై నేటికి 15 సంవత్సరాలు గడిచాయి. అమీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటికే స్టార్ డమ్ ను సంపాదించిన సూర్య తమ్ముడిగా, తమిళ సీనియర్ నటుడు శివకుమార్ తనయుడిగా కార్తీ ఆరంగేట్రం జరిగింది.
తమిళంలో కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లకే కార్తీకి తెలుగు టికెట్ లభించింది. యుగానికొక్కడు సినిమా అనువాదంతో వైవిధ్యమైన గుర్తింపు దక్కడం, ఆ వెంటనే ఆవారాతో తెలుగులో కార్తీకి మంచి గుర్తింపు లభించింది. పెద్దవైన కనులతో ఈ నటుడు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పొందాడు.
అయితే తొలి రెండు అనువాద సినిమాల ఊపుతో కార్తీ మూడో సినిమా 'నా పేరు శివ' మంచి అంచనాల మధ్యన విడులైంది. అయితే తెలుగువారిని ఈ సినిమా విసిగించింది. ఈ మధ్యనే దీనికి ఏదో తమిళ సీక్వెల్ వచ్చింది. అయితే నా పేరు శివ తెలుగులో కార్తీ గ్రాఫ్ నుతగ్గించి వేసింది.
ఆ తర్వాత వచ్చిన శకుని కార్తీని తెలుగులో మరింత నిరాశ పరిచింది. దీంతో కార్తీని తెలుగు జనం పట్టించుకోవడం దాదాపు మానేశారు. తమిళంలో మాత్రం ఇతడి కెరీర్ కాస్త స్టడీగానే సాగింది. ఆ సమయంలో ఇతడు తమిళంలో సినిమాలు చేసినా, అవి తెలుగులోకి అనువాదం కూడా ఆగిపోయింది. ఇలా డబ్బింగ్ మార్కెట్ కార్తీ విషయంలో పూర్తిడౌన్ అయ్యింది.
కొద్దో గొప్పో అంచనాలతో వచ్చిన బిరియానీ కూడా ఇక్కడ హిట్ ను ఇవ్వలేదు. కొంతకాలానికి డైరెక్టు తెలుగు సినిమాతో కార్తీ కి కాస్త సానుకూల పరిస్థితి ఏర్పడింది. తెలుగు, తమిళాల కోసం రూపొందిన ఊపిరి సినిమాతో కార్తీ కెరీర్ కు కాస్త ఊరట లభించింది.
ఆ తర్వాత కాష్మోరా డబ్బింగ్ ఫర్వాలేదనిపించింది. కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఖాకీ రూపంలో లభించింది. ధీరన్ అధికారం ఒండ్రు పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. క్రిటిక్స్ చేత కూడా ప్రశంసలు పొందింది. ముప్పై కోట్ల బడ్జెట్ కు రెండు వందల కోట్ల రూపాయల స్థాయి వ్యాపారాన్ని చేసింది ఈ సినిమా. ఆ తర్వాత కార్తీ సినిమాల్లో ఖైదీ ఆకట్టుకుంది.
కొన్ని డబ్బింగ్ సినిమాలు ఎవరికీ పట్టకుండా పోయాయి. హిట్స్ కూ, ప్లాఫ్ లకూ నిమిత్తం లేకుండా నటుడిగా ఆదరణ పొందుతూ 15 యేళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు.