నారా లోకేష్ కు ఊర‌ట‌నిచ్చిన నిఖిల్ కుమార‌స్వామి!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జేడీఎస్ ముఖ్య నేత కుమార‌స్వామి త‌నయుల మ‌ధ్య పోలిక క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. వీరి మ‌ధ్య‌న మాజీ సీఎం,…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జేడీఎస్ ముఖ్య నేత కుమార‌స్వామి త‌నయుల మ‌ధ్య పోలిక క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. వీరి మ‌ధ్య‌న మాజీ సీఎం, ఒక పార్టీకి పెద్ద దిక్కుగా ఉండ‌టం అనే పోలిక‌లున్నాయి. వీరి త‌న‌యుల మ‌ధ్య పోలిక ఏమిటంటే.. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యాడు నారా లోకేష్. త‌న తండ్రీ సీఎం పీఠ‌మే ల‌క్ష్యంగా ఆ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌గా, లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గే ల‌క్ష్యంతో అప్పుడు బ‌రిలోకి దిగారు. అయితే మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడిని ఓడించారు. 

ఇప్పుడు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఎలాగోలా కింగ్ మేక‌ర్ గా సీఎం కావాల‌నే ప్ర‌య‌త్నంతో బ‌రిలోకి దిగారు కుమార‌స్వామి. ఈ మాజీ సీఎం ఈ సారి కూడా త‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌నే లెక్క‌లేశారు దేవేగౌడ త‌న‌యుడు. అయితే అలాంటిది జ‌ర‌గ‌క‌పోగా.. కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ రామ‌న‌గ‌ర నుంచి ఓట‌మి పాల‌య్యాడు.

నిఖిల్ కు అవ‌కాశం ఇవ్వ‌డానికి ఆయ‌న త‌ల్లి ఈ సీటును త్యాగం చేశారు. పార్టీకి ఆట ప‌ట్టు, దేవేగౌడ కుటుంబానికి హోం గ్రౌండ్ లాంటి రామ‌న‌గ‌ర నుంచి నిఖిల్ గెల‌వ‌లేక‌పోయాడు. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇక్క‌డ ఘ‌న‌విజ‌యం సాధించాడు. ఇలా తండ్రి సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఎన్నిక‌ల్లో త‌న‌యుడు ఓట‌మి పాల‌య్యాడు. 

ఇలా నారా లోకేష్, నిఖిల్ కుమార‌స్వామి ఈ ఘ‌న‌త‌ను జాయింటుగా పంచుకుంటున్నారు. అయితే నిఖిల్ కు ఇది వ‌ర‌స‌గా రెండో ఓట‌మి. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఈయ‌న మండ్యా నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగాడు. అప్పుడు సీనియ‌ర్ న‌టి, దివంగ‌త అంబ‌రీష్ స‌తీమ‌ణి సుమ‌ల‌త చేతిలో నిఖిల్ ఓట‌మి పాల‌య్యాడు.