కర్నాట‌క‌లో బీజేపీ ఓట‌మి…ఏపీ పార్టీలు హ్యాపీ!

క‌ర్నాట‌క ప్ర‌జానీకం బీజేపీని చావు దెబ్బ‌తీశారు. ఇంత వ‌ర‌కూ దేశ వ్యాప్తంగా ఏ ఎన్నిక జ‌రిగినా బీజేపీదే విజ‌యం అన్న‌ట్టుగా సాగింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల ముందు క‌ర్నాట‌క‌లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం…

క‌ర్నాట‌క ప్ర‌జానీకం బీజేపీని చావు దెబ్బ‌తీశారు. ఇంత వ‌ర‌కూ దేశ వ్యాప్తంగా ఏ ఎన్నిక జ‌రిగినా బీజేపీదే విజ‌యం అన్న‌ట్టుగా సాగింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల ముందు క‌ర్నాట‌క‌లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం బీజేపీ జీర్ణించుకోలేని ప‌రిస్థితి. మ‌రోవైపు కాంగ్రెస్ మ‌ళ్లీ పుంజుకోవ‌డం విప‌క్షాల‌కు భారీ ఊర‌ట‌గా చెప్పుకోవ‌చ్చు. దేశమంతా విప‌క్షాలు బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భిన్న‌మైన ప‌రిస్థితి.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అంటే ఏపీ పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీలు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయే దుస్థితి. బీజేపీ ఓట‌మిపై ఏపీ పాల‌క ప్ర‌తిప‌క్షాల మ‌నోగతం ఏంట‌నేది సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌ర్నాట‌క‌లో బీజేపీ ఓట‌మిపై  వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు నోరు మెద‌ప‌డం లేదు. కానీ బీజేపీ ఓట‌మిపై ఈ పార్టీల‌న్నీ లోలోప‌ల సంబ‌రాలు చేసుకుంటున్నాయి. ఈ మూడు పార్టీల కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ ఓట‌మిపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే మూడు పార్టీల అధినేత‌లు, ముఖ్య నాయ‌కులు మాత్రం నోరు తెర‌వ‌డం లేదు. కాంగ్రెస్ గెలుపుపై అమిత‌మైన సంతోషాన్ని మ‌న‌సులో ఉంచుకోవ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ కాళ్ల బేరానికి వ‌స్తుంద‌ని మూడు పార్టీల ఇన్న‌ర్ ఫీలింగ్‌. ఇంత కాలం త‌నకు ఎదురే లేద‌ని విప‌క్ష పార్టీల‌పై కేంద్రంలోని బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర సంస్థ‌ల‌ను అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

క‌ర్నాట‌క‌లో ఓట‌మికి తోడు నార్త్ ఇండియాలో కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీపై త‌ప్ప‌క ప్ర‌భావం చూపుతోంది. ఆ దృష్ట్యా త‌మ‌తో పొత్తు కోసం బీజేపీ దిగి వ‌స్తుంద‌ని ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన ఆశిస్తున్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీలో కూడా క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

క‌ర్నాట‌క ఫ‌లితాల నేప‌థ్యంలో తాము చెప్పిన‌ట్టు బీజేపీ విన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌మ్మ‌కం. బీజేపీని అడ్డుపెట్టుకుని జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని వారి అంచ‌నా. అయితే ఇప్ప‌టికే బ‌లంగా ఉన్న త‌న విష‌యంలో బీజేపీ మ‌రింత సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని వైసీపీ భావిస్తోంది. ఇలా క‌ర్నాట‌క ఫ‌లితాలు ఏపీలోని మూడు పార్టీల్లోనూ సంతోషాన్ని నింపాయి. ఈ మూడు పార్టీలు ఊహిస్తున్న‌ట్టుగా బీజేపీ ఒక మెట్టు కిందికి దిగుతుందా? లేదా? అనేది కాలం తేల్చాల్సి వుంది.