క్లారిటీతో తీర్పిచ్చిన క‌న్న‌డీగులు.. ఆప‌రేష‌న్లు లేన‌ట్టే!

ప్ర‌తి ఐదేళ్ల‌లో ఇద్ద‌రు ముగ్గురు సీఎంలు. మూడు నాలుగు సార్లు సీఎం ప్ర‌మాణ‌స్వీకారాలు. గ‌త ఐదేళ్ల‌లో నాలుగు సార్లు క‌ర్ణాట‌క సీఎంలు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 2018 ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే య‌డియూర‌ప్ప సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం…

ప్ర‌తి ఐదేళ్ల‌లో ఇద్ద‌రు ముగ్గురు సీఎంలు. మూడు నాలుగు సార్లు సీఎం ప్ర‌మాణ‌స్వీకారాలు. గ‌త ఐదేళ్ల‌లో నాలుగు సార్లు క‌ర్ణాట‌క సీఎంలు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 2018 ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే య‌డియూర‌ప్ప సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 

ఆ ప్ర‌భుత్వం రోజుల వ్య‌వ‌ధిలోనే కూలిపోయింది. ఆ త‌ర్వాత కుమార‌స్వామి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ ప్ర‌భుత్వం ఏడాదిన్న‌ర పాటు కొన‌సాగింది. మ‌ళ్లీ య‌డియూర‌ప్ప సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను బీజేపీ అధిష్టానం దించింది. బొమ్మైని సీఎంగా నియ‌మించింది. ఇలా ఐదేళ్ల‌లో నాలుగుసార్లు సీఎంలు ప్ర‌మాణ స్వీకారం చేయాల్సివ‌చ్చింది. దీనికి కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ది ప్ర‌జ‌లు స్ప‌స్ట‌మైన తీర్పు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే!

2013లో కాంగ్రెస్ కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చింది. అప్పుడు కాంగ్రెస్ సీఎంల‌ను మార్చ‌లేదు. దీంతో ఐదేళ్ల పాటు సిద్ధ‌రామ‌య్య సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. 2008లో క‌న్న‌డీగులు బీజేపీకి అనుకూల‌మైన తీర్పును ఇచ్చినా బీజేపీ ముగ్గురు సీఎంల‌ను మార్చింది. య‌డియూర‌ప్ప‌, స‌దానంద‌గౌడ‌, జ‌గ‌దీష్ షెట్ట‌ర్ ఆ ట‌ర్మ్ లో ఐదేళ్ల పాటు ఈ ముగ్గురూ సీఎంలుగా వ్య‌వ‌హ‌రించారు. 2004లో హంగ్ త‌ర‌హా తీర్పును ఇచ్చారు ప్ర‌జ‌లు. దీంతో అప్పుడు చాలా ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. ధ‌ర‌మ్ సింగ్, కుమార‌స్వామి, య‌డియూర‌ప్ప‌.. ఇలా అప్పుడు మూడేళ్ల‌లోనే ముగ్గురు సీఎంలు మారారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు త‌ప్ప‌లేదు!

ఇలా రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌కు, హంగ్ అనే అంచ‌నాల‌కూ, మూన్నాళ్ల‌కు ఒక ముఖ్యమంత్రి అనే రాజ‌కీయం క‌ర్ణాట‌క‌లో అల‌వాటుగా మారింది. బొమ్మైని కూడా బీజేపీ అధిష్టానం ఎన్నిక‌ల ముందే మార్చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా గ‌ట్టిగా సాగింది. మరి క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు కూడా వీటితో విసిగిపోయారో ఏమో కానీ.. ఈ సారి స్ఫష్ట‌మైన తీర్పును ఇచ్చారు.

బ‌హుశా.. కాంగ్రెస్ గ‌నుక లేని గంద‌ర‌గోళం రేప‌క‌పోతే.. ఆప‌రేష‌న్ క‌మ‌ల లు ఈ ఐదేళ్ల‌కూ ఉండ‌ని విధంగా ప్ర‌జ‌లు తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్ సీట్ల సంఖ్య 134కు పైనే న‌మోద‌య్యేలా ఉంది. కింగే త‌ప్ప‌.. కింగ్ మేక‌ర్ కు క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు చోటు ఇవ్వ‌డం లేదిప్పుడు. 

ఎమ్మెల్యేల కొనుగోలు, ఫిరాయింపులు వంటివి ఇప్పుడు అంత తేలిక కాక‌పోవ‌చ్చు. కాంగ్రెస్ కు మెజారిటీకి అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేల సంఖ్య క‌న్నా దాదాపు ఇర‌వై సీట్లు అద‌నంగా ల‌భిస్తున్నాయి. దీంతో.. ప్ర‌జ‌లైతే స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ కు అవ‌కాశం ఇచ్చారు. మ‌రి కాంగ్రెస్ ఏం చేస్తుందో!