చిత్తు.. చిత్తుగా.. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌మి!

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కి దారుణ ప‌రాజ‌యం ఎదుర‌వుతోంది. మోడీ మ్యాజిక్ ప‌ని చేసి మ‌రోసారి అధికారం అందుకోవ‌డం ఖాయ‌మ‌నుకున్న భ‌క్తుల‌కు షాకే త‌గులుతోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ 113…

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కి దారుణ ప‌రాజ‌యం ఎదుర‌వుతోంది. మోడీ మ్యాజిక్ ప‌ని చేసి మ‌రోసారి అధికారం అందుకోవ‌డం ఖాయ‌మ‌నుకున్న భ‌క్తుల‌కు షాకే త‌గులుతోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ 113 ను అదుకోవ‌డం మాట ఎలా ఉన్నా.. ఆ పార్టీ క‌నీసం 70 సీట్ల‌లో విజ‌యం సాధించ‌డం కూడా అనుమానంగా మిగులుతోంది. కౌంటింగ్ దాదాపు స‌గం రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీ కేవ‌లం 66 సీట్ల‌లో మాత్ర‌మే లీడ్ లో ఉండ‌టం గ‌మ‌నార్హం. 

కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ మార్కును దాటేయ‌డ‌మే గాక‌.. 130 సీట్ల‌కు పైగా లీడ్ ను సాధించింది. ఏ పార్టీ మీద ఆధార‌ప‌డ‌కుండా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తున్నారు. 

అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. బీజేపీ కేవ‌లం మూడు సీట్ల‌లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. కాంగ్రెస్ మ‌రో 111 నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్ లో ఉండ‌గా.. బీజేపీ ఇంకో 63 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదే ట్రెండ్ కొన‌సాగితే కాంగ్రెస్ పార్టీ 130 సీట్ల‌లో విజ‌యం సాధించ‌గ‌ల‌దు. బీజేపీ కేవ‌లం 66 సీట్ల‌కు ప‌రిమితం కావొచ్చు.

మ‌రి ఇదే జ‌రిగితే బీజేపీకి ఇది దారుణ ప‌రాజ‌య‌మే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కానీ, ఇత‌ర క‌మ‌ల నేత‌లు కానీ క‌ర్ణాట‌క‌లో విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మించారు. అద్భుత విజ‌యం ముందుంద‌న్న‌ట్టుగా భ‌క్తుల‌ను ఊరించారు. వీదివీధినా బీజేపీ పోరాటం తీవ్రంగా సాగింది. అయితే సీట్ల లెక్క‌ల్లో మాత్రం బీజేపీ చిత్తు చిత్తు అవుతోంది. 

గ‌త కొన్నేళ్ల‌లో బీజేపీకి క‌ర్ణాట‌క‌లో ఇది దారుణ ప‌రాజ‌యం. య‌డియూర‌ప్ప సొంత పార్టీని పెట్టుకుని బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కూడా బీజేపీ ఉనికిని చాటుకుంది. అయితే ఇప్పుడు య‌డియూర‌ప్ప బీజేపీ వెంటే ఉన్నా.. మోడీ అంతా తానైనా.. క‌మ‌లం పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. 224 సీట్ల‌కు పోటీ చేసిన బీజేపీ కేవ‌లం 66 చోట్ల మాత్ర‌మే ప‌రువు నిలుపుకునే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. బీజేపీ త‌ర‌ఫున పోటీకి దిగిన మంత్రుల్లో చాలా మంది ఓట‌మిపాల‌య్యారు. 

య‌డియూర‌ప్ప సొంత జిల్లాలో కూడా బీజేపీ చిత్త‌య్యింది. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీకి అటుఇటుగా సీట్లు వ‌చ్చి ఉంటే.. బీజేపీ చాలా గేమ్ ప్లాన్ చేసేది. కాంగ్రెస్ కు ఏ 120 లోపు సీట్లు వ‌చ్చి ఉన్నా.. ఈ ఎన్నిక‌ల త‌తంగం ఇంతటితో ముగిసేది కాడు. అయితే కాంగ్రెస్ పార్టీ 130 మార్కును కూడా దాటేస్తూ క‌ర్ణాట‌క రాజ‌కీయంలో సంచ‌ల‌నాన్ని రేపుతుండ‌టంతో బీజేపీ ఓట‌మిని ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.