ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రమే ఆప్ తరపున పోటీ చేసేందుకు ఔత్సాహికులైన యువకులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో ఆప్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని తెలిసింది.
ఢిల్లీలో ఆప్ సంచలన విజయాలు నమోదు చేసుకుని దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన పాలన అందిస్తోందని ప్రచారం యువతను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో మొదలైన ఆప్ ప్రస్థానం ప్రస్తుతం పంజాబ్‌లో పాగా వేసే వరకూ సాగింది. గోవాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో నువ్వానేనా అన్నట్టు ఢీకొందని రాజకీయ విశ్లేషకులు తాజా ఎన్నికలపై విశ్లేషిస్తున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆప్ అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే దేశ వ్యాప్తంగా ఆప్ విస్తరించే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా చైతన్యవంతమైన సమాజం అవినీతి రహిత, అభివృద్ధి సహిత పాలన కావాలని కోరుకుంటోంది. ఇందుకే తన పార్టీనే ఏకైక ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆప్‌ను రోల్‌మోడల్‌గా జనానికి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర పట్టణ, నగర ప్రాంతాల్లో పోటీ చేయాలని ఆప్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇదే జరిగితే ప్రధాన పార్టీలకు సెగ తప్పదు. ఎందుకంటే విద్యావంతులు , మేధావులు, ఆలోచనాపరులున్న చోట గెలుపోటములతో సంబంధం లేకుండా ఆప్ సిద్ధాంతాలకు ఆకర్షితులై అటు వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఏపీలో తక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల కనీసం జనానికి తమ పార్టీని పరిచయడం చేయడంతో పాటు సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనతో ఆప్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.