ఏపీ హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని  సుప్రీంకోర్టు  చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఎస్‌ బోబ్డే అన్నారు. ఈ సంద‌ర్భంగా  ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని  సుప్రీంకోర్టు  చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఎస్‌ బోబ్డే అన్నారు. ఈ సంద‌ర్భంగా  ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు సరైన‌వి కావ‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.  ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ సంక్షోభం’ అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.

ప్రభుత్వ స్పెష‌ల్ లీవ్  పిటిషన్‌ని విచారించిన సుప్రీంకోర్టు విచారించింది. ఇందులో  ఈ  కేసుతో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలను నిలిపి వేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి బెంచ్‌ ఆదేశాలు, విచారణను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదే సంద‌ర్భంలో  రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ‘మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు.. గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా’ అంటూ  సిద్దార్థ లూథ్రాను ప్రశ్నించారు.

కనీసం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనని కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయ్యార‌ని, అందువ‌ల్ల‌ అన్ని ర‌కాల విచారణలపైన స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.  సెలవుల తర్వాత ఈ పిటిష‌న్‌పై విచారణ చేస్తామని తెలిపింది.

కాగా  రాష్ట్రంలో రాజ్యాంగం వైఫ‌ల్యం చెందిందా లేదా అని తేలుస్తామంటూ జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ సుమోటోగా కేసు స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై హైకోర్టులో ఇటీవ‌ల అసాధార‌ణ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఉత్త‌ర్వుల‌ని వెన‌క్కి తీసుకోవాలని (రీకాల్‌) ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అనుబంధ పిటిష‌న్‌పై త‌మ వాద‌న‌లు వినాల‌ని ఏజీ కోరినా జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ స‌సేమిరా అన్నారు.  

ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కనీసం త‌మ వాదనలు వినాల‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది మొర‌పెట్టుకున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ప్ర‌భుత్వం వేసిన అనుబంధ పిటిష‌న్‌ను జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ ధ‌ర్మాస‌నం కొట్టేసింది. 

దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, అప్పటివరకు విచారణ వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా హైకోర్టు ధ‌ర్మాస‌నం పట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో జ‌స్టిస్ రాకేశ్‌కుమార్‌, ఏజీ శ్రీ‌రామ్ మ‌ధ్య వాడివేడిగా వాద‌న‌లు జ‌రిగాయి.

తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించ‌డంతో జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ ధ‌ర్మాస‌నానికి ఇక‌పై ఆ కేసు విచారించే అధికారం లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాతే ఈ కేసులో కోర్టుకు సహకరిస్తానని ఏజీ శ్రీ‌రామ్ తేల్చి చెప్పిన నేప‌థ్యంలో… ఇక ఆ కేసు సంగ‌తి అంతే అని చెప్పొచ్చు. 

ఎందుకంటే ఈ నెలాఖ‌రులో జ‌స్టిస్ రాకేశ్‌కుమార్ రిటైర్ కానున్నారు.  ఏది ఏమైనా అనూహ్య ఘ‌ట‌న‌ల‌కు కార‌ణ‌మైన కేసుకు సుప్రీంకోర్టు స్టే ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబును ఓడిస్తారు