కరోనా మహమ్మారికే ఇంత వరకూ మందు దొరక్క అల్లాడుతుంటే, మరో మహమ్మారి గుజరాత్ కేంద్రంగా దూసుకొస్తోంది. కరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జనానికి తాజా మహమ్మారి వణుకు పుట్టిస్తోంది. రావడం రావడంతోనే ఏకంగా ప్రాణాలను తీస్తోంది.
ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బయటపడిన ఆ మహమ్మారి మ్యూకోర్మైకోసిస్ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా వచ్చేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్ అనేవారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా అరుదైందంటున్నారు. అలాగే చాలా ప్రమాదకరమైందని హెచ్చరిస్తున్నారు. మొదట ముక్కు నుంచి ప్రారంభమై.. కళ్లకు సోకుతుందని చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్ కళ్లను చేరితే కంటి చుట్టూ కండరాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో సహజంగానే కంటిచూపు పేయే ప్రమాదం ఉంది. అలాగే మెదడుకు సోకితే మెదడువాపు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి సోకిన వెంటనే గుర్తిస్తే ట్రీట్మెంట్ తీసుకుని బయటపడొచ్చంటున్నారు. లేదంటే ప్రాణాలను తీస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాధి విషయమై ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్గెహ్లోత్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న వాళ్లు దీనిబారిన పడే ప్రమాదం ఉందని సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. ఈ వ్యాధిబారిన పడిన వాళ్లు మెదడుతో పాటు ఇతర అవయవాలు పనిచేయకుండా పోతాయన్నారు.
కాగా ఇప్పటి వరకు ఈ వ్యాధితో అహ్మదాబాద్లో 44 మంది ఆస్పత్రిపాలయ్యారు. అలాగే తొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీలో 12 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధికి గురైనవారంతా 50ఏళ్ల పైబడినవారే కావడం గమనార్హం. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి.