ఇండస్ట్రీలో తననెవరూ ఇష్టపడరని బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా వివాదాస్పద రాజకీయ విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ బీజేపీకి బాగా కావాల్సిన వ్యక్తి అయ్యారనే విమర్శలున్నాయి.
తాను అన్ని వేళలా నిజాలే మాట్లాడుతుంటానని, అందుకే అందరూ తనను ద్వేషిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇటీవల కంగనాపై ట్రోలింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తనపై సోషల్ మీడియాలో వ్యతిరేకత గురించి కంగనా మనసు విప్పారు.
తనపై వ్యతిరేకత, ద్వేషం పెరగడానికి గల కారణాలను ఆమె చెప్పుకొచ్చారు. మొట్ట మొదట తాను నిజాయితీగా ఉంటానన్నారు. చిత్రపరిశ్రమలో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ గురించి నిజాలను నిర్భయంగా బయట పెట్టినట్టు కంగనా తెలిపారు.
దీంతో ఇండస్ట్రీలో చాలా మంది తనను ఇష్టపడరన్నారు. అలాగే తాను రిజర్వేషన్లను వ్యతిరేకించానన్నారు. ఈ కారణంతో హిందువుల్లో చాలా మంది తనను వ్యతిరేకిస్తున్నారని కంగనా చెప్పుకొచ్చారు. మణికర్ణిక సినిమా విడుదల సందర్భంలో రాజ్‌పుత్‌లతో గొడవను గుర్తు చేశారు.
అలాగే ఖలిస్తానీలను వ్యతిరేకించడంతో చాలా మంది సిక్కులకు తనంటే అసలు పడదన్నారు. ఇస్లాంవాదులను వ్యతిరేకిస్తుండడంతో వారు తనను ద్వేషిస్తున్నట్టు చెప్పారు. ఇలా తనను వ్యతిరేకించడానికి గల కారణాలను కంగనా ఏకరువు పెట్టారు.
తనలాంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి తీసుకోదన్నారు. కానీ ఈ ప్రపంచంలో తననె ఎవరూ మెచ్చుకోకున్నా.. మనస్సాక్షి మాత్రం తనను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. ఇంత మంది వ్యతిరేకిస్తున్నా, ఆమె మాత్రం మరింత గట్టిగా నిలబడడమే ఆశ్చర్యం.