ఏపీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. ప్రత్యేక హోదా అటకెక్కించేశారు, విభజన హామీల మీద మాట్లాడేవారే లేరు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం మీద చూస్తే కదిలేస్ సీన్ అంతకంటే లేదు.
ఈ సమయంలో తాజా బడ్జెట్ లో కూడా కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసింది అని సీపీఎం మండిపడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాటల్లో అయితే కేంద్రం ఏపీని అసలు ఒక స్టేట్ గా అయినా గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సమయంలో కేంద్రం మీద అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఒక్కటిగా పోరాడాలని ఆయన అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలూ బీజేపీ మీద దండెత్తి మరీ తమ హక్కుల సాధనకు కృషి చేస్తూంటే ఏపీలో మాత్రం అలాంటి వాతావరణమే కనిపించడంలేదని విమర్శించారు.
కేంద్రానికి ఎంతసేపూ అర్జీలు సమర్పించడం తప్ప గట్టిగా గొంతు ఎందుకు పెద్దగా వినిపించరు అంటూ ఆయన పాలక ప్రధాన ప్రతిపక్షాలను నిలదీస్తున్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో వైసీపీ, టీడీపీ ఎందుకు కలసిరాకుండా పోతున్నాయని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలు బీజేపీని మోడీని నిలదీస్తే ఏపీ ప్రజలు చూడాలనుకుంటున్నారని ఆయన అంటున్నారు.
దేశమంటే అంబానీ, అదానీలు కారోయ్, దేశమంటే మనుషులోయ్ అని బీజేపీ పెద్దలకు చెప్పాలని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా విపక్షాలు అన్నీ కలసి పోరాడాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తానికి ఎర్రన్న కోరిక బాగానే ఉంది కానీ ఏపీలో ఆ రెండు పార్టీలూ కలసి పోరాటం చేయడం కుదిరే పనేలా అన్నదే చూడాలి మరి.