తన వైవాహిక జీవితానికి సంబంధించిన సరదా సంఘటనను షేర్ చేసుకున్నాడు హీరో కార్తికేయ. తన భార్య తరఫు బంధువులు పెళ్లికి ముందు తనను చిన్న పిల్లాడ్ని చూసినట్టు చూసేవారని చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత మాత్రం అంతా తనను పెద్ద మనిషిగా చూస్తున్నారని, పెళ్లి తర్వాత తను గమనించిన పెద్ద మార్పు ఇదేనంటున్నాడు.
“వైవాహిక జీవితం బాగుంది. బాధ్యత పెరిగినట్టు అనిపిస్తోంది. అలా అని జీవితంలో పెద్ద తేడా అనిపించడం లేదు. ఎందుకంటే నా భార్య నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా భార్య ఫ్యామిలీలో చాలామంది నన్ను పెళ్లికి ముందు చిన్న పిల్లాడిలా చూసేవారు. పెళ్లి తర్వాత కాస్త హుందాగా చూస్తున్నారు. అంతకుమించి పెద్దగా తేడాల్లేవు. ఇప్పటివరకైతే నా భార్యతో ఎలాంటి గొడవల్లేవు. అంతా హ్యాపీ.”
ఇలా తన వైవాహిక జీవితంపై స్పందించాడు కార్తికేయ. అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలో విలన్ గా నటించిన ఈ తెలుగు నటుడు.. బైక్ రైడింగ్ వచ్చినప్పటికీ, వలిమై కోసం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
“ఆర్ఎక్స్ 100 చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నా ప్రతి సినిమాలో బైక్ ఉంది. కానీ నేను అంత పెర్ ఫెక్ట్ కాదు. వలిమై కోసం 3 రోజుల ముందే చెన్నై వెళ్లి రేస్ బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాను. ఎవరైనా అలా చేయాల్సిందే. లేకపోతే కష్టం. అజిత్ గారు ప్రొఫెషల్ రేసర్. ఆయన ఇచ్చిన సలహాలు కూడా నాకు బాగా పనిచేశాయి.”
వలిమై తర్వాత రేస్ బైకులపై తనకు మోజు పెరిగిందని, త్వరలోనే వ్యక్తిగతంగా ఓ రేస్ బైక్ కొనుక్కుంటానని చెప్పుకొచ్చాడు కార్తికేయ. ఇక ఓటీటీపై స్పందిస్తూ.. 2-3 వెబ్ సిరీస్ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆ స్క్రిప్టులు నచ్చక ఓకే చెప్పలేదంటున్నాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది వలిమై.