ఇంతకీ కేసీఆర్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా..?

2018 ఎన్నికల్లోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. సీఎంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మధ్యలోనే దిగిపోతారని, కొడుక్కి పట్టాభిషేకం చేసి, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం…

2018 ఎన్నికల్లోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. సీఎంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మధ్యలోనే దిగిపోతారని, కొడుక్కి పట్టాభిషేకం చేసి, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అవేవీ నిజం కాలేదు. మరిప్పుడు జరుగుతున్న ప్రచారమైనా వాస్తవ రూపం దాలుస్తుందా..?

సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే కేసీఆర్ కేంద్రంపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కూటములు కడుతున్నారు. ఇప్పుడున్న ఊపు అప్పటికి చల్లారుతుందా.. అలానే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద డౌట్.

అసెంబ్లీకి పోటీ చేస్తే, కేసీఆర్ కి జాతీయ రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేదని అనుకోవాలి. కేవలం హడావిడి కోసమే ఆయన “థర్ట్ ఫ్రంట్” అనుకోవాల్సిందే. అదే కేసీఆర్.. 2023లో తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలవకుండా సీఎం కుర్చీ త్యాగం చేస్తే మాత్రం అదో పెద్ద సాహసం అనుకోవాలి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే మాత్రం కేసీఆర్ కి ఎమ్మెల్యే సీటు ప్రతిబంధకంగా ఉండకూడదు. అంటే ఆయన 2023 ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం అవ్వాలి. కేసీఆర్ ఆలోచన ఏంటో అప్పుడు తేలిపోతుంది.

ఎంపీగా ఎక్కడి నుంచి..?

గతంలో కేసీఆర్ కరీంనగర్, మహబూబ్ నగర్.. రెండు స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల ప్రకారం ఎక్కడినుంచైనే గెలుస్తామనే ధీమా కేసీఆర్ లోనూ, టీఆర్ఎస్ లోనూ ఉంది. ఓ పద్ధతి ప్రకారం కేసీఆర్ పావులు కదిపితే.. తాను ఎంపీగా పోటీ చేసే నియోజకవర్గాన్ని 2023 అసెంబ్లీ ఎన్నికలనాటికే ఎంచుకుంటారు. ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని పెట్టి గెలిపించుకుంటారు. ఆ తర్వాతి ఏడాది ఎంపీగా అక్కడినుంచి పోటీ చేస్తారు. 

తన నియోజకవర్గంపై ఫోకస్ తక్కువ పెట్టి, జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలకు టైమ్ కేటాయిస్తారు. ఇదీ లెక్క. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారనే విషయం క్లియర్ గా అర్థమౌతోంది. థర్డ్ ఫ్రంట్ సమాలోచనలు, సమీకరణాలు జోరుగా సాగుతున్నాయి. 

ఓవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని డ్రామాగా బీజేపీ కొట్టి పారేస్తున్నప్పటికీ.. కేసీఆర్ గురించి బాగా తెలిసిన వ్యక్తులు మాత్రం సీఎం వ్యవహారశైలిని సీరియస్ గానే తీసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీ పదవి వైపు మొగ్గుచూపుతారా అనేది తేలాల్సి ఉంది. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలనాటికి పిక్చర్ క్లారిటీ వస్తుంది.