చంద్రబాబుకు అందరూ సలహాదారులే

రాజ‌కీయ నాయకులకు సలహా దారులు అవసరమే. కానీ నాలుగు దశాబ్దాల అనుభవం నాది అని చెప్పుకునే చంద్రబాబుకు అవసరం లేదు. ఆయనే ఎంతో మంది జాతీయ నాయకులకు పాఠాలు చెప్పారు. చెప్పగలరు. అలాంటి చంద్రబాబు…

రాజ‌కీయ నాయకులకు సలహా దారులు అవసరమే. కానీ నాలుగు దశాబ్దాల అనుభవం నాది అని చెప్పుకునే చంద్రబాబుకు అవసరం లేదు. ఆయనే ఎంతో మంది జాతీయ నాయకులకు పాఠాలు చెప్పారు. చెప్పగలరు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు చాలా మందికి లోకువైపోయారు. 2019లో ఓటమి పాలై, జ‌గన్ ఎత్తుగడలకు సరైన ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయలేక చతికిలపడిపోతున్న నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దానిపై ప్రతి ఒక్కరు బాబుకు సలహాలు ఇచ్చేస్తున్నారు.

బాబుగారు ఇలా చేయాలి. అలా చేయాలి అంటూ అద్భుతమైన రాజ‌కీయ ప్రణాళికలు అందిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే బాబుగారు మరీ లోకువైపోయారా? లేక ఆయనకు ఏమీ తెలియదని, తట్టడం లేదని వీరంతా అనుకుంటున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే అంతో ఇంతో సింపతీ వుంది, ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలనుకునే మీడియా చానెళ్లు కొన్ని వున్నాయి. అవి నిత్యం కాకపోయినా, వీలయినంత గ్యాప్ లో చర్చావేదికలు పెడుతుంటాయి.

రోజు సాయంత్రం కావడం అల‌స్యం గ్రామాల్లో రచ్చబండ దగ్గర కూర్చున్నట్లు రెడీ అయిపోతారు. వీళ్లలో దేశం సింపతైజ‌ర్లే ఎక్కువ. యాంకర్ల సంగతి చెప్పనక్కరే లేదు. జ‌ర్నలిస్ట్ కు తక్కువ, రాజ‌కీయ అభిమానులకు ఎక్కువ అన్నట్లు మాట్లాడుతుంటారు. ఈ చర్చల్లో ఈ మధ్య భలే చిత్రమైన సలహాలు అన్నీ వినిపిస్తున్నాయి.

బాబుగారు అమరావతి నుంచి యాత్ర ప్రారంభించాలట..అలాగే బాబుగారి కోడలు నారా బ్రాహ్మణి తిరుపతి నుంచి, కొడుకు లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టాలట. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసి అన్ని నియోజ‌క వర్గాలు త్వరగా చుట్టేయాలట. పాపం, మరి బాలయ్యను ఎందుకు వదిలేసారో? ఆయన కూడా కొన్ని ఏరియాలు కవర్ చేసేస్తే బెటర్ కదా?

ఈ సలహా సంగతి ఎలా వున్నా, ఒక విషయం మాత్రం అర్థం అవుతోంది. తెలుగుదేశం అంటే బాబుగారి కుటుంబ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ. కోసం ఎక్కడైనా పర్యటించాలంటే నాయకులు లేరు. కేవలం బాబు కుటుంబ సభ్యులు తప్ప. అలాగే బాబుగారు ఏమీ చేయడం లేదు..ఆలోచించడం లేదు అని ఈ రచ్చబండ నాయకులు డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అందుకే తాము సలహాలు ఇవ్వడం ప్రారంభించేసారు.

ఇక యాంకర్ కమ్ పార్టీ సింపతైజ‌ర్లు వుండనే వున్నారు. వారు కూడా భలే ముక్తాయిస్తున్నారు. ‘బాబు కుటుంబం అంతా రోడ్డున పడాలి’ అనేట్లుగా. ఇందులో వెటకారం వుందో? మమకారం వుందో? వారికే తెలియాలి. కానీ బాబుగారికి అన్ని విషయాలు తెలుసు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి ఎలా వుందో? తను కానీ తన కుటుంబం కానీ వెళ్తే వెనుక వచ్చే జ‌నాలు ఏ మేరకు వుంటారో బాగా క్లారిటీ వుంది.

ఎందుకుంటే పార్టీలో సీనియర్లు పేపర్ టైగర్లు అయిపోయారు. యంగ్ జ‌నరేషన్ అంతా వైకపా, జ‌నసేనల్లో సర్దుకున్నారు. మిడ్ రేంజ్ ఏజ్ గ్రూప్ మాత్రం కాస్త మిగిలింది. అందుకే బాబుగారు గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాలు వదిలేసి, నిత్యం ప్రెస్ మీట్ పేరటం పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. పైగా ఆయన ఇలాంటి యాత్రలు అవీ చేయలేకనే కదా, అమరావతి రైతుల యాత్ర ప్లాన్ చేయించింది.

త్వరలో పవన్ బాబు ఎలాగూ నారసింహ యాత్ర అంటూ ఒకటి ప్లాన్ చేసారు. ఇలా అందరూ తలా యాత్ర చేస్తే ఫలితం మాత్రం తీసుకోవడానికి బాబుగారు రెడీగా వుంటారు. ఆ తరువాత ఏ ఎన్నికా అవసరం లేకుండా పదవి చేపట్టడానికి చినబాబు లోకేష్ నాయుడు రెడీగా వుంటారు.

ఏమైనా బాబుగారికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల అవసరమూ లేదు. ఆ ఖర్చూ లేదు. ఫ్రీగా టీవీ చానెళ్లలో నిత్యం ఆయనకు బోలెడు సలహాలు అందుతూనే వుంటాయి. ఖర్చులేని పని.