జగన్ పై విషం చిమ్మేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీడీపీకి.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అస్త్రంగా మారింది. టీటీడీని అడ్డు పెట్టుకుని వైసీపీపై లేనిపోని అభాండాలు వేస్తున్న వైరివర్గం.. తాజాగా తిరుమలలో ఆర్జిత సేవల టికెట్ రేట్లను భారీగా పెంచారనే దుష్ప్రచారానికి తెరతీసింది. ముందుగా ప్లాన్ ప్రకారం ఏబీఎన్ లో ఓ వీడియో విడుదలైంది.
ఆ తర్వాత టీడీపీ అనుకూల సోషల్ మీడియా వింగ్ లు, వెబ్ సైట్లు.. దీని గురించి చిలువలు పలువలుగా రాశారు. ఆర్జిత సేవల టికెట్ రేట్లను భారీగా పెంచుతున్నారని, దానికి కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని ప్రచారం మొదలు పెట్టారు. మీటింగ్ లో వైవీ మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ప్రచారం చేశారు.
ఆర్జిత సేవల్లో ప్రత్యేక రికమండేషన్ ఉన్న టికెట్ రేట్లను పెంచితే ఇబ్బంది ఏదీ ఉండదని, ఆ దిశగా ఆలోచించాలని అధికారుల్ని ఆదేశించారు వైవీ సుబ్బారెడ్డి అయితే, ఆర్జిత సేవల్లో సామాన్య భక్తులకిచ్చే సాధారణ కోటా టికెట్ రేట్లు పెంచబోతున్నట్టు ప్రచారం చేసింది టీడీపీ అనుకూల మీడియా. దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇస్తూ, ఆ దుష్ప్రచారాన్ని ఖండించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయిని హెచ్చరించారు.
వైసీపీ అధికారంలోకి రాగానే మొదలు..
నిజానికి తిరుమల దేవస్థానంపై గతంలో ఇంత అసత్య ప్రచారం ఎప్పుడూ జరగలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే.. మత ప్రాతిపదికన జగన్ పై బురదజల్లేందుకు ప్రణాళికలు రచించింది టీడీపీ. బ్రహ్మోత్సవాలకు ఆయన సతీసమేతంగా హాజరు కావడంలేదని లాజిక్ తీసింది. ఇక తిరుమల కొండపైకి వెళ్లే బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ ఆమధ్య పెద్ద రాద్ధాంతం చేసింది కూడా. టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారని, టీటీడీ బోర్డ్ లో ఉన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గతంలో శిలువ మోసే కార్యక్రమంలో పాల్గొన్నారంటూ రకరకాల ప్రచారాలు చేసింది.
టీటీడీ డిప్యూటీ ఈవోగా అన్యమతానికి చెందిన వ్యక్తిని నియమించారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కానీ ఈ ఆరోపణలేవీ నిలబడలేదు. అసత్యాలని ప్రజలకు అర్థమవుతూనే ఉంది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈలోగా అసత్యాలన్నీ ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి, భక్తులని గందరగోళ పరుస్తున్నాయి.
కరోనా విలయం తర్వాత దర్శన టికెట్ల వ్యవహారంలో కూడా తిరుమల దేవస్థానంపై తెలుగుదేశం పార్టీ వేయని అభాండమంటూ లేదు. ప్రకృతి విపత్తుతో తిరుమలలో భారీ వర్షాలు కురిస్తే దానికి కూడా ప్రత్యేక కారణాలున్నాయంటూ చేసిన విష ప్రచారం అన్నిటికీ పరాకాష్ట. ఈ బురదనంతా కడిగేసుకోవడం టీటీడీకి తలకు మించిన భారంగా మారింది.
అందుకే టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది. చట్టపరంగా వెళ్తే ఏమవుతుందో తెలిసిందే కదా.. గతంలో ఓ పచ్చపత్రికపై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. టీడీపీ బుద్ధి మారనంత కాలం ఈ అసత్య ప్రచారాలను అడుగడుగునా ఖండించడం మినహా టీటీడీ చేయగలిగిందేమీ లేదు.