ఉన్నట్టుంది సడెన్ గా దర్శకుడు తేజ తన కొత్త సినిమా ప్రకటించాడు. కేవలం ప్రకటించడమే కాదు, నిన్న అట్టహాసంగా ముహూర్తం కూడా పూర్తిచేశాడు. పనిలోపనిగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయడంతో పాటు, ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశాడు.
నిన్నటి రోజు ఆయనకు సెంటిమెంట్. సరిగ్గా 20 ఏళ్ల కిందట అదే రోజున జయం మూవీ షూటింగ్ కూడా మొదలైంది. ఈ విశేషాలన్నీ పక్కనపెడితే.. నిన్న లాంఛ్ అయిన సినిమాలో హీరోగా తేజ కొడుకు నటిస్తున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్.
నల్లమలపు బుజ్జి బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేశాడు తేజ. ఈ సినిమాకు విక్రమాదిత్య అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాతో తన కొడుకు అమితవ్ తేజను హీరోగా పరిచయం చేస్తున్నాడు దర్శకుడు తేజ. ఇదొక పీరియాడిక్ సినిమా. 1836 నాటి కథతో ఈ ప్రేమకథ తెరకెక్కనుంది. దర్శకుడు తేజ 10 ఏళ్ల కిందట రాసుకున్న లైన్ ఇది.
తన కొడుకు లాంఛింగ్ కు ఈ సినిమా అయితే బాగుంటుందని తేజ భావించాడు. అనుకున్నదే తడవుగా సినిమాను పట్టాలెక్కించాడు. ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు.
ప్రస్తుతం తేజ చేతిలో రెండు పెద్ద బాధ్యతలున్నాయి. అహింస అనే సినిమాతో సురేష్ బాబు చిన్నకొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు తేజ. ఇప్పుడు స్వయంగా తన కొడుకును కూడా ఇండస్ట్రీలో లాంచ్ చేయబోతున్నాడు. ఇలా రెండు పెద్ద బాధ్యతలు మోస్తున్నాడు ఈ సీనియర్ దర్శకుడు.