చంద్రబాబునాయుడు చాలా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో పేరుమోసిన నాయకుడు. ప్రత్యేకించి ఎన్నికలకు టికెట్ల కేటాయింపు సమయంలో.. ఆయన చిట్టచివరి నిమిషం వరకు టికెట్ ఎవరికో ఖరారు చేయకుండా నాన్చుతారనే పేరు చాలానే ఉంది. ప్రత్యేకించి పోటీ ఎక్కువగా ఉండే సీట్ల విషయంలో ఆయన ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు.
ఇద్దరు ముగ్గురు నాయకులు ఒకే సీటుకు నామినేషన్లు వేసేసి.. నామినేషన్ ఉపసంహరణ సమయం ముగిసేవేళకు బిఫారం ను హెలికాప్టర్ ద్వారా పంపిన ఘటనలు కూడా చంద్రబాబు చరిత్రలో ఉన్నాయి. అలాంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న తాజా కామెడీ ఏంటంటే.. ఈసారి రెండేళ్ల ముందే కొన్ని టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. కాకపోతే.. ఓడిపోయే సీట్లనే ముందుగా కన్ఫర్మ్ చేస్తుండడం విశేషం.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉంటారని చంద్రబాబు తేల్చి చెప్పారు. నియోజకవర్గ నాయకులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవడం అనేది కలలో మాట. కానీ.. ఇప్పటినుంచే అక్కడ అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేయడం విశేషం.
పులివెందులలో గత ఎన్నికల్లో సతీశ్ కుమార్ రెడ్డి టీడీపీ తరఫున పోటీచేశారు. తరతరాలుగా ఆ పార్టీకి అక్కడ ఆయనే దిక్కు. 2004, 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి మీద పోటీచేసింది కూడా ఆయనే. 2014, 2019లో జగన్ మీద ఆయనే పోటీచేశారు. అయితే, 2019 ఎన్నికలతో సతీశ్ కుమార్ రెడ్డికి కూడా తెలుగుదేశం భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఆయన పార్టీని వదలిపోయారు.
ఆ తర్వాత.. ప్రస్తుత ఎమ్మెల్సీ బీటెక్ రవి.. పులివెందుల ఇన్చార్జిగా ఉన్నారు. తాజాగా పులివెందుల నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించినప్పుడు, సతీశ్ కుమార్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నదని నాయకులు అడిగినప్పుడు.. ఎవరు వచ్చినా రాకున్నా.. పులివెందుల టికెట్ బీటెక్ రవికే అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.
ఓడిపోయే సీటుకోసం రెండేళ్ల ముందు అభ్యర్థిని తేల్చడం ఒక కామెడీ అయితే.. మరీ పరువు తక్కువగా ఓడిపోయిన చరిత్ర ఉన్న బీటెక్ రవిని మళ్లీ మోహరించడానికి నిర్ణయించడం ఇంకో కామెడీ. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఎదురొడ్డి మరొకరు గెలవడం సాధ్యమయ్యే సంగతి కాకపోయినప్పటికీ.. సతీశ్ కుమార్ రెడ్డి.. వైఎస్ మీద పోటీచేసిన సందర్భాల్లో 30వేల పైచిలుకు, జగన్ మీద పోటీచేసిన సందర్భాల్లో 40వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. కానీ.. 2011 ఉప ఎన్నికల్లో ఇక్కడ ఇదే బీటెక్ రవి పోటీచేసి.. కేవలం 11 వేల ఓట్లకే పరిమితం అయ్యారు.
ఇవన్నీ చంద్రబాబునాయుడుకు తెలియని సంగతులు కాదు గానీ.. ఓడిపోయే సీటే అయినప్పటికీ.. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీకి దిక్కుగా ఉన్న బీటెక్ రవి అన్యధా భావించకుండా ఈ టికెట్ కన్ఫర్మేషన్ కామెడీ నడిపించినట్లుగా కనిపిస్తోంది.