మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ భారీ స్కెచ్ వేసిందా? అంటే … ఔననే సమాధానం వస్తోంది. ఈ కేసు విచారణలో సీబీఐ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిందితుల ఎత్తుకు పైఎత్తు వేస్తూ తన దైన రీతిలో విచారణ సాగిస్తోంది. పులివెందుల నివాసి ఉదయ్‌కుమార్‌రెడ్డి పిటిషన్‌తో సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై కడప పోలీసులు కేసు నమోదు చేసిన రోజే… మరో సంచలనం వెలుగు చూడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ పెద్దలు గట్టిగా వాదించడంతో పాటు సీబీఐని టార్గెట్ చేయడం అనేక పరిణామాలకు దారి తీస్తోంది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలకు సీబీఐ అధికారులు నోరు తెరిచి సమాధానం చెప్పకుండా, రాతలతో తమ పని తాము చేసుకుపోతున్నారు. విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో సీబీఐ మరింత పట్టుదల, కసితో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో 2020, జూలై 28న సీబీఐ అధికారుల ఎదుట నాటి పులివెందుల సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం నేడు వెలుగు చూడడం వెనుక సీబీఐ భారీ స్కెచ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ విచారణాధి కారిపైనే కడప పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో …సీబీఐ కూడా నిందితుల కథేందో తేల్చుకోవాలని పంతానికి పోయినట్టు కనిపిస్తోంది.
ఒక ప్రజాప్రతినిధి అయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై అభియోగం కావడంతో సీబీఐ కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డిలే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో సీఐ శంకరయ్య వాంగ్మూలాన్ని తెరపైకి తెచ్చిందనే వాదన వినిపిస్తోంది. విచారణలో తాము తేల్చే సంగతి పక్కన పెడితే, జనాన్ని నమ్మించేందుకు సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంద నేందుకు శంకరయ్య వాంగ్మూలాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీబీఐకి సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశం ఏంటంటే…
“మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి అప్పట్లో నాతో చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించొద్దని అన్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలోనే ఆధారాల ధ్వంస ప్రక్రియ సాగింది” …ఇంతకంటే సీబీఐ సాధించాల్సిన పురోగతి ఏముంటుంది? ఈ వాక్యాలు చాలవా వైఎస్ అవినాష్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి? సీబీఐతో రివర్స్ గేమ్ ఆడి అనవసరంగా నెత్తి మీదకి తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని జనాన్ని నమ్మించేందుకు సీబీఐ సమయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఆ గడువు ముగియగానే సీబీఐ తన పని తాను చేస్తుందనడంలో అనుమానం లేదు. అయితే ఆ సమయం దగ్గర్లోనే ఉన్నట్టు తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.