ఇటు చూడు వెంకన్నా 1 : ట్రోలింగ్‌ల వెనుక మాఫియా!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇటీవలి సమావేశంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల గిరులపై ప్రతి భక్తుడికీ, ప్రతిపూటా వేంకటేశ్వరుని ప్రసాదమే భోజనంగా దక్కేలా సంకల్పించింది. తిరుమల గిరులపై ఉండే ప్రెవేటు హోటళ్లు,…

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇటీవలి సమావేశంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల గిరులపై ప్రతి భక్తుడికీ, ప్రతిపూటా వేంకటేశ్వరుని ప్రసాదమే భోజనంగా దక్కేలా సంకల్పించింది. తిరుమల గిరులపై ఉండే ప్రెవేటు హోటళ్లు, చిన్న చిన్న కాకాహోటళ్లను మూసి వేయించి.. తిరుమల వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అన్నదాన వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. అన్నివేళలా అందుబాటులో ఉండేలా.. శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేయాలన్నది టీటీడీ నిర్ణయం. 

భగవంతుని సన్నిధిలో.. మనం స్వీకరించే ప్రతి మెతుకూ భగవంతుని ప్రసాదమే అయి ఉండేలా.. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇది. అయితే ఈ నిర్ణయంపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఉత్తరాది వాళ్లు ఏం తినాలి? 24×7 టీటీడీ అన్నదాన వితరణ కేంద్రాలు అందుబాటులో ఉంటాయా? లాంటి అర్థం పర్థంలేని ప్రశ్నలతో టీటీడీ నిర్ణయాన్ని వెటకారం చేసే దుర్మార్గులు తయారవుతున్నారు. వాస్తవం ఏంటంటే.. తిరుమలలోని ప్రెవేటు హోటళ్ల మాఫియా, తెరవెనుక ఉండి ఇలాంటి ట్రోల్స్ ను టీటీడీ నిర్ణయం పట్ల వ్యతిరేక ప్రచారాన్ని నడిపిస్తోంది.

ఒక్క విషయం తెలిస్తే పాఠకులు దిమ్మెరపోతారు..

తిరుమలలో ప్రస్తుతం అనేక దుకాణాలు మనకు కనిపిస్తుంటాయి. రకరకాల ప్రాతిపదికల మీద ఈ దుకాణాల కేటాయింపు జరిగింది. నిజానికి ఈ దుకాణాల లైసెన్సు ఒకరి పేరు మీద ఉంటే అక్కడ దాన్ని నిర్వహించే వ్యక్తులు వేరే ఉంటారు. నిర్వహించే వ్యక్తి, లైసెన్సుదారుకు నెలకు ఇంత అని సొమ్ము ముట్టజెబుతాడు. అలా బినామీలు, లైసెన్సుదారుకు చెల్లించే మొత్తాలు అథమపక్షం లక్షన్నర నుంచి గరిష్టంగా మూడులక్షలకు మించే ఉంటున్నాయి. 

సహజంగానే.. లైసెన్సు దారులు దండుకుంటున్న ఈ మొత్తాల్లో హోటళ్లకు లీజుకు ఇచ్చిన వారికి దక్కుతున్నదే ఎక్కువ. టీటీడీ.. ప్రెవేటు హోటళ్లు మూసేయించి.. భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం వితరణ చేస్తే గనుక.. ఈ హోటళ్ల వారి దందాకు చెక్ పెట్టినట్టవుతుంది. నిజానికి టీటీడీ కూడా అంత ఘోరమైన నిర్ణయం తీసుకోలేదు. వారికి ప్రత్యామ్నాయ వ్యాపార అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే వారి దందా మొత్తం కాస్త తగ్గుతుంది. అందుకే వారంతా ఇలాంటి అందరికీ ఉచిత అన్నప్రసాద వితరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

ఉత్తరాది ప్రాంతాల భక్తులకు అవసరమైన రోటీలు అందుబాటులో ఉంచడం కూడా టీటీడీకి అసాధ్యమేమీ కాదు. అయినా తిరుమల వచ్చే భక్తులు మహా అయితే ఒకటి రెండు రోజులకు మించి అక్కడ ఉండరు. వారు కోరుకునే చిత్ర విచిత్రమైన ఫుడ్ అయిటమ్స్ రెండు రోజులు దొరక్కపోయినంత మాత్రాన ఏమైపోతారు? టీటీడీ ఆధ్వర్యంలో అందే సాంప్రదాయ అల్పాహారం, భోజనంలను ఆ రెండు రోజులు తిన్నంత మాత్రాన వారికి ఏం నష్టం జరుగుతుంది? 

సూపర్ రిచ్ గా తమ గురించి తాము అనుకునే వారు, భగవంతుడిని మించిన అహంకారం ఉన్న వారు.. ఈ అన్నప్రసాదం తమకు ఇష్టం లేదని అనుకుంటే వారు తిరుమల గిరులలో తినవలసిన అవసరమే లేదు. ఎంచక్కా తిరుపతి వెళ్లిపోయి అక్కడ తమకు నచ్చిన భోజనం తినవచ్చు.

తిరుమలకు సంబంధించినంత వరకు భగవన్నిలయం అంటే.. నాలుగుగోడల మధ్య ఉండే వేంకటేశ్వరుని ఆలయం మాత్రమే కాదు. తిరుమల గిరులు యావత్తూ భగవత్ స్వరూపం అని విశ్వసించే వారే తిరుమలకు వస్తే చాలు. వారెవ్వరికీ.. టీటీడీ తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించదు. 

రుచులను కోరుకునే వారు, చిత్ర విచిత్ర ఆహారాలను భోజనంగా కోరుకునే వారికి ఇది ఇబ్బందే. తిరుమలలో ఉండే సమయంలోనైనా జిహ్మను అదుపులో ఉంచుకోలేని వారికి అసలు.. భగవంతుని సన్నిధి ఎందుకు అనేది ప్రశ్న? భగవంతుని సన్నిధిలో, తిరుమల గిరులలో సామాన్యులు ధనికులు అనే వ్యత్యాసాలే తెలియని వాతావరణం ఉండాలనే సంకల్పంలో ఈ అన్నప్రసాద వితరణ మరో ముందడుగు. 

ఇలాంటి టీటీడీ నిర్ణయంపై ట్రోలింగ్ లు దుర్మార్గం. తమ దందాలు తగ్గిపోతాయని భయపడుతున్న దుకాణదారులు ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను నడిపించడం హేయం.