యుపిలో ఏడు దశల పోలింగు ప్రారంభమైంది. ఫిబ్రవరి 10న పశ్చిమ యుపిలోని 11 జిల్లాలలోని 58 నియోజకవర్గాల్లో 62.4% పోలింగు, ఫిబ్రవరి 14న ఆ ప్రాంతంలోనే ఉన్న 9 జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న 55 నియోజకవర్గాల్లో 60.4% పోలింగు జరిగింది. రైతులు, రాజకీయంగా చురుగ్గా వుండే జాట్లు అధికంగా ఉన్న పశ్చిమ యుపీ ఎలా ఓటు చేస్తుందో చూడాలని అందరూ కుతూహలంగా వున్నారు. 2013 ముజఫర్‌పూర్ జాట్, ముస్లిం మతఘర్షణల్లో ఎస్పీ ముస్లింల పక్షం వహించిందన్న గుర్రుతో జాట్లు 2014 నుంచి బిజెపివైపు మళ్లడంతో, బిజెపి యుపిలో విజయం సాధించడం ప్రారంభమైంది. అయితే ఏడాదికి పైగా సాగుచట్టాలకు వ్యతిరేకంగా జాట్లు, రైతులు ఉద్యమించడం, దాన్ని బిజెపి అణచివేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన దిల్లీకి సమీపంలో వున్న యీ 113 నియోజకవర్గాలలోని రైతులు, ముస్లింలు బిజెపి పట్ల విముఖతతో ఉన్నారని, పాత విభేదాలు మరచి కలిసికట్టుగా బిజెపిని ఓడిస్తాయని, బియస్పీ, కాంగ్రెసు నిస్తేజంగా వుండడం చేత ముస్లిం ఓట్లు చీలవని ఎస్పీ ఆశ. అందుకే ఈ 113టిలో మేం 100 సాధిస్తాం అని అఖిలేశ్ చెప్పేసుకున్నాడు.
రాజకీయంగా చురుగ్గా వుండే పశ్చిమ యుపీ ప్రాంతం గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలి. యుపిలో మొత్తం 75 జిల్లాలుంటే ఇక్కడే 30 ఉన్నాయి. దీని సరిహద్దుల్లో హరియాణా ఉండడం చేత గ్రీన్ రివల్యూషన్ ఫలితాలు యిక్కడ కూడా కనబడి రైతులు మోతుబర్లయ్యారు. పైగా దేశరాజధానికి ఆనుకుని వుండడం చేత రాజకీయంగా కూడా చైతన్యవంతులయ్యారు. ఈ ప్రాంతంలోనే ఆగ్రా కూడా వుంది కాబట్టి, టూరిజం వలన కూడా లాభపడ్డారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. రాష్ట్రం మొత్తంమీద వారి జనాభా దాదాపు 20% వుండగా, యిక్కడ మాత్రం 26% ఉంది. ఖడీబోలీ ప్రాంతంలో 39%, బ్రజ్ ప్రాంతంలో 16% వుంది. హిందువుల్లో జాట్‌ల ప్రాబల్యం ఎక్కువే కానీ జనాభాలో వారి శాతం 17 కంటె ఎక్కువ లేదు. అనేక యితర అగ్రవర్ణాలు, బిసిలు ఉన్నారు. దేశవిభజన తర్వాత పశ్చిమ పంజాబ్ నుంచి వచ్చిన శిఖ్కులూ ఉన్నారు. జాట్లు పంచాయితీల ద్వారా యితరులను ప్రభావితం చేయగలరు. వారు, ముస్లింలు కలిస్తే నియోజకవర్గాన్ని బట్టి 30-50% ఓట్లు అవుతాయి కాబట్టి, 77 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయంగా మార్పు తేగలరు. కానీ సాధారణంగా వారి మధ్య గొడవలు జరుగుతూనే వుంటాయి.
ఇప్పుడు యిద్దరూ కలిసిపోయారు కాబట్టి, జాట్ రైతుల పార్టీ ఐన ఆర్‌ఎల్‌డితో చేతులు కలిపాం కాబట్టి తమదే విజయమని అఖిలేశ్ అంచనా వేస్తున్నాడు. కానీ అది ఎంతమేరకు నిజమో ఫలితాలు వస్తే తప్ప తెలియదు. 2014, 2019 పార్లమెంటు ఎన్నికలలో ఆర్‌ఎల్‌డికి ఒక్క సీటూ రాలేదు. ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చౌధురి, అతని తండ్రి, అప్పటి అధ్యక్షుడు ఐన అజిత్ సింగ్ తన సొంత నియోజకవర్గాల్లో ఓడిపోయారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో 3.7% ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ 2012 నాటికి 2.3% తెచ్చుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అది 1.8%కు పడిపోయింది. ఆ పార్టీ తరఫున ఒకే ఒక్కడు నెగ్గి, తర్వాత బిజెపిలోకి గెంతేశాడు. 42 ఏళ్ల జయంత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పిజి చేశాడు. కానీ రాజకీయాల్లో ఆ డిగ్రీలు ఏ మేరకు పనికి వస్తాయో యిప్పుడు తేలిపోతుంది. అతని అధ్యక్షతన పార్టీ ఎదుర్కుంటున్న తొలి ఎన్నిక యిది.
ఆ పార్టీకి ఏదో బలం వుందనుకుంటున్న ఎస్పీ మొదటి దశలో పోలింగుకి వెళ్లిన 58టిలో 33 సీట్లు వాళ్లకు కేటాయించింది. వీటిలో 5టిలో ఎస్పీ అభ్యర్థులు ఆర్‌ఎల్‌డి గుర్తయిన హేండ్ పంప్ చిహ్నంపై పోటీ చేస్తున్నారు. ఈ కూటమి 10 మంది జాట్లకు, 11మంది ముస్లిములకు టిక్కెట్లిచ్చింది. తమకు కంచుకోటగా భావించే శివాల్కాస్‌లో ఎస్పీ తరఫున ఒక ముస్లిం అభ్యర్థిని నిలపడం జాట్లకు కోపం తెప్పించింది. ముస్లింలు జాట్లకు ఓటేసినా, జాట్లు ముస్లింలకు ఓటేయకుండా, బిజెపి తరఫున నిలబడిన జాట్‌కు ఓటేస్తారేమోనన్న అనుమానం వుంది. ఈ అంచనాతోనే బిజెపి 12 మంది జాట్లకు సీటిచ్చింది.
కూటమివారు యితర కులాలను కూడా అక్కున చేర్చుకోవాలని గుర్జర్లకు 3, దళితులకు 8, ఠాకూర్‌లకు 2, బ్రాహ్మణులకు 3 సీట్లు యిచ్చారు. ముజఫర్ నగర్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, అక్కడ ముస్లిముకు టిక్కెట్టివ్వకుండా తక్కిన ప్రాంతాల్లో కాంపెన్సేట్ చేశారు. అయినా జాట్లు తృప్తి పడలేదు. తమ జనాభా ముస్లిం జనాభాలో సగమే ఉన్న నియోజకవర్గాల్లో సైతం తమకే సీటు యివ్వాలని పట్టుబడుతున్నారు. ఇలాటి పరిస్థితుల్లో జాట్-ముస్లిం ఓట్ల బదిలీ సవ్యంగా జరుగుతుందని గట్టిగా ఎవరూ చెప్పలేకున్నారు.
బియస్పీ రంగంలో సీరియస్‌గా లేదు కాబట్టి దళిత ఓట్లు ఎస్పీ కూటమికే పడతాయన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు. ఎందుకంటే 2012-17 ఎస్పీ హయాంలో దళితులపై ఎక్కువ అత్యాచారాలు జరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. ఆ కోపంతోనే జాతవేతర దళితులు 2017లో బిజెపిని ఆదరించారు. 86 రిజర్వ్‌డ్ స్థానాల్లో 76 స్థానాల్లో బిజెపి గెలిచింది. అఖిలేశ్ నాలిక కరుచుకుని 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి బియస్పీతో పొత్తు పెట్టుకున్నా దళిత ఓట్లు ఎస్పీకి, ఎస్పీ ఓట్లు దళితులకు బదిలీ కాలేదు. ఇద్దరికీ లాభం చేకూరలేదు.
2017లో 312 గెలిచిన బిజెపికి యీసారి 225-267 వస్తాయని ఒపీనియన్ పోల్స్ చెపుతున్నాయి. పశ్చిమ యుపిలో సీట్లు తగ్గితే మాత్రం బిజెపికి 250కి లోపే రావచ్చు. తగ్గాయనే అనుమానం బిజెపి నాయకులకు కలుగుతోందని, అందుకే 4,5 దశల పోలింగులో తమ తడాఖా చూపిస్తామని అంటున్నారనీ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందు లక్ష కోట్ల రూ.ల విలువైన ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టి, అభివృద్ధి, హిందూత్వ అనే జమిలి అంశాలపై ప్రచారం మొదలుపెట్టిన బిజెపి మొదటి రెండు దశల పోలింగు అయ్యేసరికి, అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి, హిందూత్వ మీదనే ప్రచారం కేంద్రీకరిస్తోంది. ఎందుకంటే మధ్య, తూర్పు యుపిలో హిందూత్వకు మోజు తగ్గలేదని, అక్కడ బిజెపికి అధికంగానే సీట్లు వస్తాయని దాని అంచనా. ఉత్తరాఖండ్ ప్రచార సభలో మోదీ ‘దేవభూమి ఐన యీ రాష్ట్రంలో కాంగ్రెసు ముస్లిం యూనివర్శిటీని పెట్టాలని చూస్తోంది, చూడండి.’ అన్నారు. కర్ణాటక హిజాబ్ వివాదాన్ని యుపిలో ఉపయోగించుకుంటున్నారు. ముస్లింలతో అంటకాగడమంటే టెర్రరిస్టులతో కలిసి ఊరేగడమే అనే భావంలో బిజెపి నాయకులు ఉపన్యాసాలిస్తున్నారు.
గోరక్షణ తమకు ఓట్లు కురిపిస్తుందని బిజెపి గట్టి నమ్మకంతో వుంది కానీ, క్షేత్రవాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయని యోగేంద్ర యాదవ్ ఓ వ్యాసంలో రాశారు. గోవధ నిషేధం వలన, గోరక్షక నిఘా బృందాల కారణంగా గోవుల క్రయవిక్రయాలు ఆగిపోవడం వలన పశువుల మార్కెట్లు మూతపడ్డాయిట. ముసలి ఎద్దులు, ఆవుల కోసం గోశాలలు పెట్టామని ప్రభుత్వం చెప్పినా అవన్నీ కాగితాల మీదే ఉన్నాయట. గోవులకు కాకుండా అవినీతికి నిలయాలుగా మారి, ముసలి పశువులను పోషించే భారం రైతుల మీద పడింది. వాళ్లు తిండి పెట్టలేక వదిలేస్తున్నారు. అవి ఆకలితో పొలాల మీద పడి పంటలు నాశనం చేస్తున్నాయి. పంట కాపలా కాచుకోవడానికి రైతులు రాత్రుళ్లు పొలాల్లో పడుక్కోవలసి వస్తోంది. రైతులందరూ ఆవుల కారణంగా పంట నష్టాల గురించే యాదవ్‌తో మాట్లాడారట.
మధ్య, తూర్పు ప్రాంతాల్లో హిందూత్వ వ్యతిరేక ఓట్లన్నీ అఖిలేశ్ కూటమికి వస్తాయన్న గ్యారంటీ లేకుండా వుంది. ఎందుకంటే రెండు ‘బహుజన ఫ్రంట్’లు ఏర్పడి బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చబోతున్నాయి. మొదటి ఫ్రంటు పేరు భాగీదారీ పరివర్తన్ మోర్చా. దానిలో ప్రధానంగా ఉన్నవారు మజ్లిస్ పార్టీ ఒవైసీ, జన అధికారి పార్టీ బాబూ సింగ్ కుశావహా, భారత్ ముక్తి మోర్చా వామన్ మేష్‌రామ్. కుశావహా బియస్పీ నుంచి 2011లో బహిష్కరించబడ్డాడు. తర్వాత బిజెపిలో చేరాడు. అక్కడ వ్యతిరేకత రావడంతో బయటకు వచ్చాడు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కాములో యిరుక్కున్నాడు కూడా. రెండో ఫ్రంట్ ఐన సామాజిక్ పరివర్తన్ మోర్చాలో భీమ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్, రాజకుమార్ సైని, బాబురూమ్ పాల్ యిత్యాది 35 గ్రూపులున్నాయి. వీళ్లు అఖిలేశ్‌తో సీట్ల దగ్గర బేరాలు కుదరక విడిగా పోటీ చేస్తున్నారు. వీళ్లు ఎస్పీ కూటమి ఓట్లలో చీలిక తెచ్చి బిజెపికి ఉపయోగపడతారనే అంచనాలున్నాయి.
మూడవ దశలో ఫిబ్రవరి 20న 16 జిల్లాలలోని యాదవ ఆధిపత్యం ఉన్న 59 నియోజకవర్గాల్లో 60.5% పోలింగు జరిగింది. ఈ నియోజకవర్గాలు పశ్చిమ యుపిలోని ఐదు జిల్లాలలో, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలలో ఉన్నాయి. ఈ 59లో 2012లో 37 గెలిచిన ఎస్పీ కుటుంబకలహాల కారణంగా 2017లో 9 మాత్రమే గెలిచింది. బిజెపికి 49 వచ్చాయి. అందువలన యీ దశ పోలింగు ఎస్పీకి చాలా కీలకం. 38% యాదవ ఓటర్లున్న కర్హల్ నుంచి అఖిలేశ్ పోటీ చేస్తున్నాడు. కుటుంబం మద్దతు తనకుందని చూపించుకోవడానికి బాబాయి శివపాల్‌తో రాజీ పడ్డాడు. తండ్రి ములాయం వచ్చి చివరి రోజున అఖిలేశ్ తరఫున ప్రచారం చేశాడు.
కులమత సమీకరణాలు ఎలా వున్నా, యోగి పాలనాసామర్థ్యం ప్రధానాంశం కావడంలో ఆశ్చర్యం లేదు. యుపికి యోగి ‘ఉపయోగి’ అవుతారని మోదీ ఖితాబు యిచ్చారు. సరైనవాళ్లకు ఓటేయకపోతే యుపి బెంగాల్, కేరళ, కశ్మీర్‌లలా అయిపోతుందని యోగి ఓటర్లను హెచ్చరించారు. నీతి ఆయోగ్, ఆర్‌బిఐ వగైరా కేంద్ర సంస్థల గణాంకాల సాయంతో యుపిని ఆయా రాష్ట్రాలలో పోల్చి యిచ్చిన 2019-20 గణాంకాలు పేపర్లలో వచ్చాయి. పౌష్టికాహారం, విద్య, ఆర్థికస్థితి, సమానత, ఆరోగ్యం వంటి మానవాభివృద్ధికి సంబంధించిన 15 అంశాలు తీసుకుంటే వాటిలో 7టిలో యుపి తక్కిన మూడిటి కంటె వెనుకబడి వుంది. ఉదాహరణకి శిశుమరణాల రేటు కేరళలో 3, కశ్మీర్‌లో 7, బెంగాల్‌లో 12 ఉండగా, యుపిలో 35 ఉంది. ఇతర గణాంకాల గురించి వచ్చే వ్యాసాల్లో చెప్తాను.
ఇప్పటిదాకా జరిగిన దశల్లో పోలింగు శాతాలు 60-62 మధ్య ఉండడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ అనుకూల ఓటు కానీ, వ్యతిరేక ఓటు కానీ బలంగా లేదని అనుకోవాలంటున్నారు. అనేక రంగాల్లో, ముఖ్యంగా కరోనాను ఎదుర్కోవడంలో యోగి ప్రభుత్వం వైఫల్యం చెందినా, దానికి ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న ఎస్పీపై కూడా ప్రజలకు ఫిర్యాదులున్నాయి. వారి హయాంలో గూండాగిరీ విపరీతంగా నడిచిందని, యోగి దౌర్జన్యంగానైనా, చట్టవిరుద్ధంగానైనా సరే, గూండాలను అదుపు చేసి శాంతిభద్రతలు కాపాడుతున్నాడనీ ప్రజలు భావిస్తున్నారట. కొన్ని సందర్భాల్లో ముస్లింలపై జాలి ఉన్నా వాళ్లను ఎక్కడ ఉంచాలో యోగి అక్కడ ఉంచాడనే భావం కూడా జాట్లతో సహా చాలామంది హిందువుల్లో ఉందట.
రైతులకు బిజెపిపై ఆగ్రహం వుంది కాబట్టి మొదటి మూడు దశల్లో తండోపతండాలుగా ఓటర్లు వచ్చి బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకుంటే, అది జరగకపోవడంతో యిలాటి వ్యాఖ్యలు వస్తున్నాయి. నాలుగో దశలో 59 నియోజకవర్గాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిలోను, 5,6,7 దశల్లోనూ బిజెపి పుంజుకుంటే, అంతిమంగా వారికి 250కి మించి రావచ్చు. ఎస్పీ విషయానికి వస్తే లాభమే తప్ప నష్టం ఉండదు. గతంలో 22 మాత్రమే వచ్చాయి కాబట్టి యీసారి నాలుగైదు రెట్లు ఎక్కువ వచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందని అనుకోవడంలో బేససబు లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)