మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై సోషల్ మీడియాలో నెటిజన్లు కుమ్ముడే కుమ్ముడు. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌమ్యుడిగా, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నేతగా గుర్తింపు పొందిన గౌతమ్‌రెడ్డి మృతిని రాజకీయం చేయడాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. బండారు పైశాచికత్వాన్ని పౌర సమాజం చీల్చి చెండాడుతోంది.
మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై బండారు వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటంటే…
“గౌతం రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయి. గౌతం రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉండగా ఎలాగైనా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావాలని ఎవరో ఒత్తిడి తెచ్చారు? దుబాయ్‌లో ఉన్నన్ని రోజులు ఇదే విషయంపై భరించ లేని ఒత్తిడితో ఇబ్బంది పడి ఉంటాడు. గౌతమ్‌రెడ్డి వయసు కేవలం 50 ఏళ్లు. ఆయనకు గుండెపోటు రావడం ఏంటి? ఆయన మానసిక క్షోభకు గురయ్యాడు. గౌతమ్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశాడు.
బండారు సత్యనారాయణ అనుమానాలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
బండారు సత్యనారాయణ మానసిక ఆరోగ్యంపై ఆ పార్టీ శ్రద్ధ పెట్టాలని సెటైర్స్ విసిరారు. మరీ ముఖ్యంగా బండారు సత్యనారాయణకు వెంటనే ఆయన కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టాలి. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేలా ఉంది అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఆయన చుట్టూ కంచె కట్టడంతో పాటు సన్నిహితులు, అభిమానులను దూరంగా పెట్టాలని ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మామ మానసిక స్థితిపై యువ ఎంపీ ఎంతగా ఆందోళన చెందుతుంటారో అని కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి.
బండారును పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మరికొందరు టీడీపీ అధినేతను అప్రమత్తం చేయడం గమనార్హం. గౌతమ్ మృతికి టీడీపీ హూందాగా నివాళి అర్పించింది.
చంద్రబాబు, గల్లా జయదేవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితర టీడీపీ ముఖ్య నేతలు గౌతమ్ మృతదేహాన్ని సందర్శించి మంచి ఆయన గురించి రెండు మంచి మాటలు చెప్పి ప్రశంసలు అందుకున్నారు. కానీ బండారు లాంటి నేతల వల్ల ఈ సమయంలో అనవసరంగా రాజకీయాలు చోటు చేసుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.