మైత్రీ మూవీస్ నిర్మించే బాలయ్య సినిమా ఇలా ప్రారంభమైంది. దానిపై అలా రకరకాల గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. అన్నింటికన్నా కీలకం ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు ఫ్రీమేక్ అన్నది. అక్కడి సినిమా స్టిల్ ను, బాలయ్య స్టిల్ ను కంపార్ చేస్తూ పోస్టింగ్ లు మొదలయ్యాయి.
బాలయ్యకు ఇష్టం లేకపోయినా తొలిసారి బ్లాక్ చొక్కా వేసారు ఆ ఒరిజినల్ సినిమాను దృష్టిలో వుంచుకుని అని టముకేయడం ప్రారంభమైంది. అయితే తమ కథ ఒరిజినల్ అని, ఫ్రీమేక్ కాదని చెప్పడానికి యూనిట్ కిందా మీదా అవుతోంది. గతంలో సేతుపతికి ఫ్రీమీక్ చేసారు క్రాక్ సినిమాగా. అందుకే ఇప్పుడు ఎవ్వరూ నమ్మడం లేదు.
మరోపక్కన క్రాక్ ఎందుకు హిట్ అయింది? ఆ సినిమాలోని యాక్షన్ సీన్ల వల్ల. అఖండ విజయం వెనుక కూడా యాక్షన్ సీన్లు వున్నాయి. అందుకే ఈసారి కూడా బాలయ్య సినిమా నిండా యాక్షన్ సీన్లు కుమ్మరించేస్తున్నారంటూ మరిన్ని గ్యాసిప్ లు. సినిమా ప్రారంభం నుంచి ఫైటు..సీను..ఫైటు..సీను..ఇలా తయారు చేస్తున్నారని, అందువల్ల ఏకంగా చిన్నా పెద్దా కలిపి ఎనిమిది ఫైట్ల వరకు వుంటాయని మరో టాక్.
ఇంక మరో ముచ్చట ఏమిటంటే అఖండ లో డబుల్ రోల్ క్లిక్ అయింది, పైగా బాలయ్య సక్సెస్ ఫుల్ సినిమాలు అన్నీ డబుల్ రోల్ నే. అందుకే ఈ సినిమాకు అదే ఫార్ములాలో వెళ్లాలని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కథను మళ్లీ అటు ఇటు తిప్పి డబుల్ రోల్ లోకి తెస్తున్నారని, ఈ మేరకు మొత్తం స్క్రిప్ట్ ను మళ్లీ మారుస్తున్నారని ఇంకో టాక్.
మొత్తం మీద షూట్ ప్రారంభమై రెండు రోజులు కాకుండానే బాలయ్య సినిమా స్క్రిప్ట్ మొత్తం మారిపోతోంది…వార్తల్లో.