పనికి రాలేదు.. పరువు తీసింది

సినిమా ట్రయిలర్ విడుదల కావచ్చు..ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు. హీరో ప్రసంగం కీలకం. ముఖ్యంగా పెద్ద సినిమాలకు. కానీ పాపం, బాలకృష్ణ సినిమాలకు అలాంటి పరిస్థితి వుండదు. ఆయన ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో…

సినిమా ట్రయిలర్ విడుదల కావచ్చు..ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు. హీరో ప్రసంగం కీలకం. ముఖ్యంగా పెద్ద సినిమాలకు. కానీ పాపం, బాలకృష్ణ సినిమాలకు అలాంటి పరిస్థితి వుండదు. ఆయన ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతారు. సినిమా సబ్జెక్ట్ గురించి అస్సలు మాట్లాడరు. మహా అయితే అప్పటికప్పుడు కనిపించిన లేదా గుర్తుకు వచ్చిన టెక్నీషియన్లకు, నటులకు ఓ ప్రశంస పడేస్తారు అంతకు మించి వుండదు.

నిన్నటికి నిన్న భగవంత్ కేసరి సినిమా ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. గోపీచంద్ మలినేని, బాబి, వంశీ పైడిపల్లి లాంటి పెద్ద దర్శకులు హాజరయ్యారు. అనిల్ రావిపూడి వుండనే వున్నారు. ఇలాంటి వేదిక మీద బాలయ్య స్పీచ్ నే కీలకం. కానీ ఎప్పటి లాగే ఆ స్పీచ్ ‘నాన్నగారు’ చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి కుటుంబం పరువు తీసే మాటతో ముగిసింది.

బాలయ్యకు తన తండ్రి అంటే అమితమైన గౌరవం. ఎప్పటికప్పుడు అది మాటల్లో బయటకు వస్తుంటుంది. అది చాలా మంచి విషయం. అలాగే బాలయ్య తన ఆడపిల్లలను ఇద్దరినీ ఎంతో పద్దతిగా పెంచారని వినిపిస్తూ వుంటుంది. ఆ మేరకు ఆ ఇద్దరు పిల్లలూ కూడా ఎక్కడ కనిపించినా ఎంతో పద్దతిగా కనిపిస్తూ వుంటారు. కానీ బాలయ్య కుమారుడు మోక్షజ్ఙ మీద మాత్రం ఒకప్పుడు బొలెడు గ్యాసిప్ లు వచ్చాయి. అతగాడి సినిమా ఎంట్రీ పదేళ్ల నుంచి ఇదిగో అదిగో అని వినిపిస్తూనే వుంది తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. దీని మీద కూడా బోలెడు గ్యాసిప్ లు వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో శ్రీలీల సరసన తాను హీరోగా నటిస్తానుఅ అంటే తన కొడుకు మోక్షజ్ఙ తనను ‘ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా’ అని అడిగాడు అని వెల్లడించారు బాలయ్య. ఇది ఒక విధంగా తన కొడుకు పరువు తను తీయడమే. తన పరువు తను తీసుకోవడమే. తను తండ్రికి ఎంత గౌరవం ఇస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటి బాలయ్యకు కొడుకు ఇచ్చే గౌరవం ఇదా అని జనం మాట్లాడుకోరా? తండ్రి ని ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసింది అని అడిగేంత సంస్కార హీనుడు బాలయ్య కొడుకు అని జనం నవ్వి పోరా?

సరే, ఈ ముచ్చట అలా వుంచితే సినిమాలో చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్ చేతిని ఆఫ్ స్క్రీన్ లో పట్టుకున్నారనే గదా మెగాస్టార్ ను ట్రోల్ చేసారు. మరి సినిమాలో కూతురిగా నటించిన శ్రీలీలతో హీరోగా నటించాలని చెప్పిన బాలయ్యను కూడా అదే పని చేయాలి కదా? ఏమిటో..కొందరు ఏం చేసినా, ఏం మాట్లాడినా లైట్ తీసుకుని వదిలేస్తారు తప్ప పట్టించుకోరు. అలాంటి సినిమా వాళ్ల జాబితాలో బాలయ్య ముందు వుంటారేమో?

వీటన్నింటికన్నా బాబులాంటి వ్యవహారం ఇంకోటి వుంది. కొడుకు గురించి మాటలు చెబుతూ తన చేతిని ఓ విధంగా ఊపారు. ఈ మధ్య ఇలా ఊపడం అన్నది బాలయ్యకు అలవాటు అయినట్లుంది. అసెంబ్లీలో కూడా అలాగే ఊపారు. బహుశా ఈ ఊపుడు అన్నది పూరి జగన్నాధ్ తో సినిమా చేసినప్పటి నుంచి అలవాటు అయి వుండొచ్చు. కానీ పక్కన శ్రీలీల లాంటి చిన్న అమ్మాయిని పెట్టుకుని ఇలా చేయడం అంటే..హతవిధీ..అనుకోవాలేమో?