సినిమాలను సమీక్షకులు చంపేస్తున్నారు అని కొందరు అంటారు. సినిమాను సమీక్షకులే నిలబెట్టారని కొందరంటారు. పెళ్లి చూపులు నుంచి సార్ సినిమా వరకు చాలా సినిమాలు ముందుగా ప్రివ్యూలు వేసి, మంచి సమీక్షలు వచ్చాక సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా ప్రచారం చేసి సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు చాలా మంది. మొత్తం మీద ఈ విషయంలో సినిమా జనాల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నాయి. భిన్నమైన వాదనలు వున్నాయి.
ఈ నేపథ్యంలో తొలివారం అస్సలు తమ సినిమాను ఎవ్వరూ సమీక్షించకుండా ఉత్తర్వులు ఇవ్వమంటూ కొర్టుకు ఎక్కారు ఓ మలయాళ సినిమా నిర్మాతలు. Aromalinte Aadhya the Pranayam అనే సినిమా నిర్మాతలు తమ సినిమాను ఎవ్వరూ తొలివారం అస్సలు సమీక్షించకూడదు అని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఓ ‘గ్యాగ్ ఆర్డర్’ ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
వీడియో రివ్యూలు కానీ, అభిప్రాయాలు కానీ ఏ సోషల్ మీడియా పేజెస్ లో షేర్ చేసుకోకుండా చూడాలంటున్నారు. అంతే కాదు. మరో అడుగు ముందుకు వేసి, కేంద్రం సమీక్షకులకు కొన్ని గైడ్ లైన్స్ రూపంలో సినిమా రేటింగ్స్ మీద కొన్ని రూల్స్ పెట్టాలని నిర్మాతలు కోరుతున్నారు. సమీక్షల వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతోంది అంటున్నారు.
నిజానికి సమీక్షలు సినిమాకు ఉపయోగపడతాయి అనడంలో కొంత వాస్తవం వుంది. క్రెడిబులిటీ వున్న మాధ్యమాలు, వ్యక్తులు రాస్తే ఉపయోగపడతాయి. కానీ సోషల్ మీడియా విస్తృతంగా పెరిగాక, వివిధ కారణాల రీత్యా రకరకాల అభిప్రాయాలు అత్యంత వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవి పాజిటివ్ గా వుంటే సినిమాకు పనికి వస్తున్నాయి. నెగిటివ్ గా వుంటే బాగాలేని సినిమా చాలా త్వరగా థియేటర్లలోంచి తప్పుకోవాల్సి వస్తోంది.
ఇంతకీ ఈ మలయాళ సినిమా మేకర్లు ఇలా అసలు సమీక్షలే వద్దు అంటున్నారు అంటే వాళ్ల సినిమా మీద వాళ్లకు వేరే విధమైన అభిప్రాయం వుందా? లేదా సమీక్షలు రావని ముందే ఫిక్స్ అయిపోయారా?