విలక్షణ క్యారెక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ ను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభకు పంపుతారని ప్రచారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలోనూ, టీవీ చానెళ్ళలోనూ బాగా జరుగుతోంది. టీఆర్ఎస్ నాయకులే ఈ విషయం చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉంది.
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరపడానికి కేసీఆర్ ముంబై వెళ్లడం, అక్కడ చర్చల్లో ప్రకాష్ రాజ్ కూడా పాలుపంచుకోవడం జరిగినప్పటి నుంచి కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవి నిజమవుతాయో కాదో చెప్పలేం.
నిజమైతే మాత్రం ప్రకాష్ రాజ్ కు సినిమా నటుల్లో అరుదైన గౌరవం దక్కిందనే చెప్పుకోవాలి. కళాకారులను, క్రీడాకారులను, వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారిని రాజ్యసభకు పంపి గౌరవించడం సాధారణ విషయమే. ఇలా వెళ్లినవారిలో చాలామంది పార్లమెంటుకు హాజరు కారు కూడా. ఒకవేళ వెళ్లినా నోరు విప్పి మాట్లాడరు.
కానీ కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపాలనుకునేదే నిజమైతే అది కళాకారుడిగా గౌరవించి కాదు. తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడానికి. కేసీఆర్ రాజకీయ అవసరాలు ఏమిటో తెలిసిందే. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అనుసరిస్తోంది బీజేపీ వ్యతిరేక విధానం.
ఇదే భాజాలంతో ఉన్న, జాతీయస్థాయిలో అందరికీ తెలిసిన వ్యక్తి కావాలి. ఢిల్లీలో తన తరపున లాబీయింగ్ చేయగల వ్యక్తి అయి ఉండాలి. ఆరేడు భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు కావాలి. నిశ్చితమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాడై ఉండాలి. రాజకీయాలపట్ల అవగాహన ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు ప్రకాష్ రాజ్. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది.
బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు ప్రకాష్ రాజ్ ఉపయోగపడతాడని కేసీఆర్ భావించి ఉండొచ్చు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణం కావొచ్చు. ప్రకాష్ రాజ్ కు దక్షిణాది సినీరంగ ప్రముఖులతోనే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులతోనూ సంబంధాలు ఉన్నాయి. వారితో వారి భాషలోనే మాట్లాడగలడు కూడా. ఈ కారణాల వల్ల కేసీఆర్ ఆయన్ని ఎంచుకొని ఉండొచ్చు.
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవకాశం కల్పిస్తే జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం ఉంటుంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా.. జూన్‌లో మరో ఇద్దరు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగియనుంది. 3 స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి గులాబీ పార్టీతో టచ్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్ ఆ సంబంధాలను కొనసాగిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు నినాదాన్ని అందుకోవడంతో అప్పుడు ప్రకాశ్‌రాజ్ మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రకాశ్‌రాజ్ మూడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో గులాబీ బాస్ కర్ణాటకలో పర్యటించిన సమయంలో మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయ్యారు. అప్పుడు కూడా ప్రకాశ్‌రాజ్ ఉన్నారు.
సో వీరి క్లోజ్ నెస్ చాలా రోజుల నుంచి ఉంది. అదీ ఇప్పుడు మరింత బలపడి.. పదవీ ఇచ్చేందుకు దోహదపడనుంది. తెలంగాణ పరిపాలన పైన, కేసీఆర్ ఆలోచనకు చాలాసార్లు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ మద్దతుగా మీడియాలో ప్రచారం చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ చేతిలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని కేసీఆర్ కల్పిస్తున్నారని అనుకోవచ్చా?