తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపనపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎంతగా అడ్డుకున్నా వైఎస్సార్‌టీపీని స్థాపించామన్నారు. తమది రాజకీయ పార్టీ అన్నారు. రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేస్తామనని స్పష్టం చేశారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే, తెలంగాణకు అంత మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తానంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ఇక్కడేదో ఉద్ధరించినట్టు ఇప్పుడు దేశాన్ని పాలిస్తారట అని ఎద్దేవా చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవని పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఎందుకు గెలిపించామా? అని తెలంగాణ ప్రజలే అనుకుంటున్నారని షర్మిల అన్నారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశానికంతటికి అవసరం లేదని కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమిపై మండిపడ్డారు. దయచేసి దొరగారికి చెప్పండని మీడియాను ఆమె కోరారు. తెలంగాణ నాయకుడు దేశాన్ని పరిపాలిస్తే తప్పేంటని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆమె తన మార్క్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో పుట్టిన వాడు దేశాన్ని పరిపాలిస్తే మీరు, నేను అందరం సంతోషిస్తామన్నారు. ఇక్కడ ఉద్దేశం అది కాదన్నారు. కానీ అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
ఈ రోజు ఇంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కేసీఆర్ కారణం కాదా? ప్రజల సమస్యల గురించి పాలకులు మాట్లాడుతున్నారా? ఎంతసేపూ రెచ్చగొట్టే మాటలే కదా? అని షర్మిల ప్రశ్నించారు. నిజంగా చెప్పండి కేసీఆర్‌కు పాలించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఉద్యమకారుడని నమ్మి, పరిపాలన ఆయన చేతిలో పెడితే ఈ రోజు కేసీఆర్ ఏం చేస్తున్నారు? కనీసం తనకు తెలిసిన పంట, తనకిష్టమైన పంటను సాగు చేసుకునే స్వేచ్ఛ కూడా మన రాష్ట్రంలో రైతులకు లేదని వాపోయారు.
పిల్లలు చదువుకుందామంటే విశ్వవిద్యాలయాల్లో 60 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఒక ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… బెదిరిస్తే బెదిరిపోయే దాన్ని కాదన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తే లొంగేదాన్ని అంతకంటే కాదని తెగేసి చెప్పారు. అలాగే ఎవరు ఎంత అడ్డుకున్నా వైసీఆర్‌టీపీని స్థాపించామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఇబ్బంది వస్తుందని అక్కడ రాజకీయ పార్టీ పెట్టొద్దని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. నేడు ఆ వ్యాఖ్యలను షర్మిల పరోక్షంగా గుర్తు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.