మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పదేపదే సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలపై నోరు పారేసుకుంటుంటారు. అయినప్పటికీ అతన్ని ఏమీ చేయలేని పరిస్థితి. అయ్యన్న మాత్రం యథేచ్ఛగా తన దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తుంటారు. దీనంతటికి కారణం చట్టంపై ఆయనకున్న అపారమైన నమ్మకమే. అదే ఆయన బలం, ధైర్యం.
డబ్బు, అధికారం, రాజ్యాంగ వ్యవస్థల్ని మేనేజ్ చేయగల నాయకత్వం అండదండలు ఉండడం వల్లే తనను ఏ చట్టం ఏమీ చేయలేదనే భరోసానే ఆయనతో ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాయి. సీఎంను నోటికొచ్చినట్టు తిడితే ఏమవుతుంది? మహా అయితే పోలీసులు కేసు పెడతారు, అంతే కదా? అంతకంటే తనకేం కాదని గతానుభవాలు ఆయనకు పాఠాలు నేర్పాయి.
తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, ఆ తర్వాత ఏమవుతుందనే చర్చకు దారి తీసింది. ఏమీ కాదని పాలకప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తమ ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడిపై పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నాయకుడు ఫిర్యాడు చేయడాన్ని గమనించొచ్చు.
గతంలో ఇలాగే సీఎం, హోంమంత్రి సుచరితపై కూడా అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేశారు. అనంతరం అయ్యన్న పరారయ్యారు. కోర్టుకెళ్లి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఎన్ని కేసులైనా ఇదే కదా జరిగేదని అయ్యన్న ఓ నిర్ణయానికి వచ్చి… అవాకులు చెవాకులు పేలుతున్నారని ప్రత్యర్థులు భావిస్తున్నారు.