రెచ్చ‌గొట్ట‌డం మాని…టీటీడీ గోడు వినండి!

తెల్లారి లేచిన మొద‌లు బీజేపీ నేత‌ల‌కు మ‌తం త‌ప్ప మ‌రొక‌టి ప‌ట్ట‌దు. రాష్ట్రాల‌తో పాటు దేశాన్ని అభివృద్ధి ప‌థంలో తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న మ‌చ్చుకైనా వారిలో క‌నిపించ‌దు. దేశంలో మెజార్టీ వ‌ర్గీయుల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటూ…

తెల్లారి లేచిన మొద‌లు బీజేపీ నేత‌ల‌కు మ‌తం త‌ప్ప మ‌రొక‌టి ప‌ట్ట‌దు. రాష్ట్రాల‌తో పాటు దేశాన్ని అభివృద్ధి ప‌థంలో తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న మ‌చ్చుకైనా వారిలో క‌నిపించ‌దు. దేశంలో మెజార్టీ వ‌ర్గీయుల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటూ రాజ‌కీయ ప‌బ్బాన్ని దిగ్విజ‌యంగా జ‌రుపుకోవ‌డం ఒక్క బీజేపీకే చెల్లింది. ఇప్ప‌టికే ఏపీ స‌మాజం కులం కంపుతో విసిగిపోయింది. అది చాల‌ద‌న్న‌ట్టు మ‌తాన్ని తీసుకొచ్చేందుకు బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఈ విద్య‌లో ఆరితేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మ‌రే ప‌నిలేన‌ట్టు నోరు తెరిస్తే మ‌తాన్ని ముందుకు తెస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హిందూ మ‌తాన్ని దెబ్బ‌తీసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. రిజ‌ర్వేష‌న్ పొందుతూ మ‌తం మారితే అన‌ర్హ‌త త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ హిందూ ధార్మిక సంస్థ టీటీడీకి సంబంధించి విదేశీ విరాళాలు పొందే ఎఫ్‌సీఆర్‌ను కేంద్ర‌హోంశాఖ రెన్యువ‌ల్ చేయ‌లేదు. దీంతో ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున విదేశీ విరాళాలు టీటీడీకి ఆగిపోయాయ‌ని హిందువులు వాపోతున్నారు. కేంద్ర‌హోంశాఖ నిర్ల‌క్ష్యం వ‌ల్లే టీటీడీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని సంబంధిత అధికారులు మండిప‌డుతున్నారు. 

ప‌లుమార్లు ఎఫ్‌సీఆర్ఏ రెన్యువ‌ల్ విష‌యాన్ని కేంద్ర హోంశాఖ‌కు గుర్తు చేసినా, ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని టీటీడీ అధికారులు అంటున్నారు. ఇలాంటి ప‌నికొచ్చే అంశాల్ని జీవీఎల్ లాంటి మేధావులు ప‌ట్టించుకోరెందుకో అని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. కావున ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజానికి కేంద్ర ప్ర‌భుత్వం చాలా మంచి చేస్తోంద‌నే ప్ర‌చారం మాని, చేయ‌ని వాటిపై దృష్టి పెడితే మంచిద‌ని టీటీడీ అధికారులు హిత‌వు చెబుతున్నారు.