‘రెండు భాగాలు’..అందమైన వంచన!

సినిమా మేకింగ్‌కు సంబంధించిన అనేకానేక తెరవెనుక అంశాలు.. కామన్ మేన్‌కు కూడా విపులంగా తెలిసిపోతున్న ఈ రోజుల్లో.. ‘బౌండ్ స్క్రిప్ట్’ లేకుండా, ఎవడైనా మూర్ఖుడు సెట్స్ మీదకు వెళ్లాడని అంటే.. పసిపిల్లలు కూడా నమ్మరు!…

సినిమా మేకింగ్‌కు సంబంధించిన అనేకానేక తెరవెనుక అంశాలు.. కామన్ మేన్‌కు కూడా విపులంగా తెలిసిపోతున్న ఈ రోజుల్లో.. ‘బౌండ్ స్క్రిప్ట్’ లేకుండా, ఎవడైనా మూర్ఖుడు సెట్స్ మీదకు వెళ్లాడని అంటే.. పసిపిల్లలు కూడా నమ్మరు! మరి ఒకసారి స్క్రిప్ట్ బైండింగ్ కూడా అయిన తర్వాత.. తీత మొదలైన తర్వాత.. అదే స్క్రిప్ట్ రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయిన తరవాత, హఠాత్తుగా అయిదు గంటలకు సరిపడేంత మంచి, గొప్ప, పెద్ద కథగా ఎలా మారిపోతుంది? ఇంత మంచి, గొప్ప, పెద్ద కథను రెండు భాగాలుగా తీస్తే తప్ప.. పాపం, తెలుగు ప్రేక్షకులకు న్యాయం చేయలేమని మేకర్స్‌కు ఎలా అనిపిస్తుంది?

అలా అనిపించడం వెనుక.. అనేక మాయామశ్చీంద్ర వేషాలుంటాయి! టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలుంటాయి! మాయల మరాఠీ గారడీలుంటాయి! గూడుపుఠాణీలు ఉంటాయి! నయగారాల మాటలతో బురిడీ కొట్టించే వంచనలుంటాయి! అలాంటి కుట్రల గుట్టువిప్పి చెప్పే ప్రయత్నమే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘‘ ‘రెండు భాగాలు’ .. అందమైన వంచన!’’

రోజా సినిమాలో ఒక మంచి సన్నివేశం ఉంటుంది. అరవింద్ స్వామిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాది లియాఖత్ తన తమ్ముడు సహా 15 మంది పిల్లలను ‘‘ద్రోహం. మీరు ఇండియాకు వ్యతిరేకంగా పోరాడండి. మిగతాది మేం చూసుకుంటాం. (అన్నారు). ఇప్పుడు.. వాళ్లే మా పిల్లల్ని కాల్చి చంపేశారు. నా తమ్ముడే అని కాదు. పదమూడు మంది. అంతా పదిహేనేళ్ల పిల్లలు. నమ్మకద్రోహం. ఇంతకాలం మేం జరిపిన పోరాటం అంతా ఎందుకు? ఈ రక్తం, ఈ అరాచకం, ఈ తీవ్రవాదం..’’ ‘‘ఈ అరాచకం తప్పని తెలిసి కూడా మీరెందుకు ఆపలేరు?’’ ప్రశ్నిస్తాడు రిషి పాత్రలోని అరవింద్ స్వామి. ‘‘మేం యుద్ధరంగంలో ఉన్నాం. అడుగు వెనక్కి వెయ్యలేం. మేం చేసేది ఒప్పో తప్పో. పోరాటం జరగాల్సిందే. శత్రువు మంచివాడో చెడ్డవాడో.. వాడిని చంపి తీరాల్సిందే.’’ అంటాడు లియాఖత్ పాత్రలోని పంకజ్ కపూర్. 

ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని భారీ చిత్రాల నిర్మాత పరిస్థితి అచ్చంగా ఈ రోజాలోని తీవ్రవాది లియాఖత్ లాంటి దయనీయమైన స్థితే. సినిమా నిర్మాణం మొదలు పెట్టేస్తారు. ఏదో కొన్ని వందల కోట్ల అంచనా బడ్జెట్ తో రంగంలోకి దిగుతారు. రెండు షెడ్యూళ్లు అయ్యేసరికి తాము అనుకున్న బడ్జెట్ అప్పటికే హారతి కర్పూరం అయిపోయి ఉంటుంది. చూడబోతే ఇంకా తీయడానికి చాలా షూటింగ్ పెండింగ్ ఉంటుంది. వారిలో కంగారు పుడుతుంది. అప్పుడిక దర్శకుడు రంగప్రవేశం చేస్తాడు. 

‘బడ్జెట్ పెరిగిందని కంగారేంద వద్దు గురూ.. ఈ సినిమాను రెండు పార్టులుగా చేసేద్దాం.. డబల్ ది ప్రాఫిట్’ అని ఊరిస్తాడు. ఆ మాటలు నిజమేనా! డబల్ ప్రాఫిట్ వస్తుందా?  అసలు సినిమా ఆఢుతుందా? ఢమాల్ అంటుందా? ఇవేమీ నిర్మాతకు పట్టవు.. అప్పటికే చాలా సినిమా షూటింగ్ జరిగింది గనుక.. ఇక వేరే గత్యంతరం లేక దర్శకుడు ఎలా చెబితే అలా విని ఆ సినిమాను పూర్తి చేయాల్సిందే. ఇప్పుడు మనకు పరిశ్రమలో తయారవుతున్న రెండు భాగాల సినిమాల ధోరణి గమనిస్తే.. అలాగే అనిపిస్తుంది. 

రెండు భాగాలు అంటే పొన్నియన్ సెల్వన్ మాత్రమే!

పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ప్రారంభించడానికి ముందే  అది రెండు భాగాలుగా వస్తుందని మణిరత్నం ప్రకటించారు. ఎందుకంటే అది చాలా విస్తారమైన పెద్ద కథ! ఒక చిత్రంగా మూడు గంటల్లో చెప్పాలంటే అసాధ్యం. అందుకే ముందుగానే రెండు భాగాలుగా అనుకున్నారు. స్క్రిప్టుకు శ్రీకారం దిద్దక ముందునుంచి అది రెండు భాగాలు.. అనుకుంటూనే పని నడిపించారు. సక్సెస్- ఫెయిల్యూర్ అనేది తర్వాతి సంగతి.. ‘రెండు భాగాలు’ అనే పదానికి అది సబబుగా కుదిరింది.

ఫరెగ్జాంపుల్.. మహాభారతాన్ని యావత్తూ ఒకే సినిమాగా తీయాలనుకుంటే సాధ్యమవుతుందా? కాదు కదా! పీఎస్ కూడా అలాంటిదే. ఇప్పటిదాకా భారత కథలతో తెలుగులో ప్రయత్నించిన వారంతా అందులోని ఒక భాగాన్ని ఒక పాత్రని ప్రధానంగా తీసుకుని మాత్రమే చిత్రాలు రూపొందించారు. పూర్తి కథను సమగ్రంగా సింగిల్ సినిమాలో చెప్పే సాహసం లేదు. సాధ్యం కాదు. పీఎస్  అలాంటిది గనుక.. దానికి రెండు భాగాలుగా న్యాయం చేశారు.

దాన్ని మినహాయిస్తే.. మొన్న అటు మొన్న తెలుగులో మొదలైన ఈ దుర్మార్గమైన రెండు భాగాల సంస్కృతి.. విజయాలను కూడా నమోదు చేస్తున్నప్పటికీ.. చాలా దారుణమైన,  వంచనాత్మకమైన ప్రయోగంగా కనిపిస్తోంది.

ముందు ఈ క్లారిటీ ఉండాలి

చాలా మంది రెండు రకాల పదాలను ఒకే రకమైన అర్థంలో వాడుతూ ఉంటారు. సీక్వెల్ వేరు, రెండు భాగాలుగా చేయడం వేరు. ఒక సినిమా విజయవంతం అయిన తర్వాత.. అది పెద్ద హిట్ అయితే.. ఆ కథ ప్రేక్షకులను రంజింపజేసింది గనుక.. ఆ కథకు పొడిగింపు తయారుచేసుకుని.. కొంతకాలానికి మరోచిత్రం కూడా రూపొందించి విడుదల చేస్తే అది సీక్వెల్ అవుతుంది. అయితే ఒకే కథను సినిమా పరిభాషలోని 70 సీన్లలోనో, నూటయాభై నిమిషాల నిడివిలోనో చెప్పడానికి సాధ్యం కాక.. అలా కుదిస్తే కథకు ద్రోహం జరుగుతుందని భయపడి, కథకు న్యాయం చేయడానికి అయిదు గంటల కథ తయారుచేసుకుని, రెండు భాగాలకు మధ్య ఆసక్తికరమైన బ్రేక్ తో తయారుచేస్తే అది రెండు భాగాల చిత్రం అనిపించుకుంటుంది.

ఇప్పుడు ఒకసారి గతంలో తెలుగులో రెండు భాగాలుగా వచ్చిన, రాబోతున్న, ప్రకటించి ఉన్న, అలాంటి ఆలోచనల్లో ఉన్న సినిమాలను నెమరు వేసుకోండి. ఏ ఒక్కటీ కూడా రెండు భాగాల రూపంలో ధర్మబద్ధంగా తయారైన, అవుతున్న చిత్రం కాదు.

సీక్వెల్ ల విషయానికి వచ్చినా.. ఇటీవలి కాలంలో ‘దృశ్యం’ ఒక్కటే పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించుకుంటుంది. అయితే.. ఒక చిత్రం కాస్త విజయవంతం అయింది గనుక.. దానికి సీక్వెల్ అని  ప్రకటించేసి.. ఇంకో కథను వండుకుని రూపొందించడం కూడా చాలా మంది చేసేస్తూ వచ్చారు. ‘రెండు భాగాలు’  విషయంలో కూడా.. అదే తరహాలో ఆ పదం అపభ్రంశం అవుతోంది. 

మీకు గుర్తుందా..?

బాహుబలి చిత్రం రెండు భాగాలుగా వస్తుందని తొలుత  ప్రకటించలేదు. చాలా భాగం షూటింగ్ అయిన తర్వాత.. రాజమౌళి ఆ విషయం ప్రకటించారు. అయితే.. దర్శకుడు రాజమౌళి ఆ క్రాఫ్ట్ మీద అపారమైన పట్టు ఉన్న, శ్రద్ధగల టెక్నీషియన్ కాబట్టి.. రెండు భాగాలు అని ప్రకటించిన తర్వాత.. స్క్రిప్టును పునఃరచించుకోవడానికి చాలా టైం తీసుకున్నారు. ఎక్కడా వదులుగా లేకుండా, లూజ్ ఎండ్స్ తెలియకుండా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత షూట్ కొనసాగించి రెండు భాగాలుగా విడుదల చేశారు. ఆ రకంగా.. తొలుత అనుకున్న కథ నిడివిని సాగదీసినప్పటికీ.. ప్రేక్షకులు ఆ సంగతి గుర్తించలేరు. కానీ ఆ తర్వాతి సినిమాలు గాడి తప్పిపోయాయి. పుష్ప దగ్గరినుంచి కూడా ఇలాంటి పోకడ మొదలైంది.

పుష్పను అప్పట్లో 300 కోట్ల బడ్జెట్ చిత్రంగా నిర్మాతకు చెప్పి ప్రారంభించారని ఇండస్ట్రీలో అంటుంటారు. అయితే కర్ణాకర్ణిగా తెలిసే సమాచారన్ని బట్టి.. సినిమా షూట్ పూర్తి కాకుండానే.. ఆ బడ్జెట్ దాటిపోయింది ఖర్చు. అప్పుడు దర్శకుడికి వచ్చిన అయిడియా ‘రెండు భాగాలు’! నిజం చెప్పాలంటే.. నిర్మాతకు ఆ సమయంలో వేరే గత్యంతరం లేదు. ఒప్పుకున్నారు. ఒక భాగం విడుదలై విజయం కూడా సాధించింది. రెండో భాగానికి సంబంధించి స్క్రిప్టు వంట పూర్తి చేసి విడుదల కావడానికి టైం తీసుకుంటోంది.

ఇప్పుడు దేవర సంగతి తీసుకుందాం. అసలు ఈ ‘రెండు భాగాలు’ అనే ప్రకటనలు ఎలా గాడితప్పిపోతున్నాయో చర్చించడానికి కారణమైన సినిమానే దేవర. కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత.. దర్శకుడు కొరటాల శివకు అప్పుడు అయిడియా స్ఫురించినట్లుంది. ‘‘ఈ కథకు న్యాయం చేయాలంటే..’’ అనే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనిని రెండు భాగాలుగా చేస్తాం అని ప్రకటించాడు. తాను చాలా నిర్దిష్టంగా వర్క్ చేసే దర్శకుడిని అని చాటుకోవడానికి, యథాలాపంగా రెండు ముక్కలు చేస్తున్న వ్యవహారం కాదని నమ్మించడానికి ఆయన రెండు భాగాల విడుదల తేదీలను కూడా ఇప్పుడే ప్రకటించారు.

ఇక్కడితో అయిపోలేదు. పవన్ కల్యాణ్ నటిస్తున్న.. అలా అని చెప్పుకుంటున్న హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు కూడా రెండేసి భాగాలుగా విడుదల అవుతాయని వినిపిస్తోంది. పవన్ ఈ చిత్రాలు చేస్తున్నారని మనం అనుకోవాల్సిందే తప్ప.. అవి ముందుకు సాగడం లేదు. పరిస్థితి ఎలా తయారైనదంటే.. నిలవడబ్బులు కాకుండా, నిర్మాత ఫైనాన్సులు తెచ్చి ఉంటే.. వడ్డీలు కట్టుకోడానికి పవన్ ఇంకో సినిమా చేస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే కాబోలు రెండు భాగాలుగా మార్చేస్తున్నారు. 

పవన్ సినిమా ప్రారంభిస్తున్నారు.. ఆ రూపేణా నిర్మాతను ఊబిలోకి దించుతున్నారు.. దర్శకుడిని వేరే పనిచేసుకోనివ్వకుండా లాక్ చేస్తున్నారు.. తాను మాత్రం సైమల్టేనియస్ గా సినిమాలు చేసుకుంటూ, రాజకీయాలు చేసుకుంటూ  నాటకాలు నడిపిస్తున్నారు. ఇదంతా వంచన కాక మరేమిటి. హరిహరవీరమల్లుగానీ, ఓజీగానీ.. రెండు భాగాలు అనే ఆలోచనతో ప్రారంభం కాలేదు. కానీ.. అవి పూర్తి కాకపోవడం వల్ల బడ్జెట్ చేయిదాటి.. రెండు సార్లు విడుదల చేస్తే తప్ప నిర్మాత బతికి బట్టకట్టని పరిస్థితి.

బడ్జెట్ లను పెంచడంలో మనవాళ్లకంటె చాలాకాలం ముందునుంచి పేరుమోసిన దర్శకుడు అయిన తమిళ శంకర్.. భారతీయుడు 2ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే బడ్జెట్ అదుపుతప్పిపోయిందని.. అందుకే భారతీయుడు 3 కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అయితే ఈ పోకడలకు భిన్నంగా.. రెండు భాగాలుగా చిత్రాన్ని అందింస్తాం.. అనే సంకేతంతో.. పెదకాపు 1 చిత్రాన్ని తెచ్చారు. నిజానికి ఈ ప్రయత్నం సాహసం అని చెప్పాలి. కానీ.. ఆ సినిమా డిజాస్టర్ అయిన తీరును బట్టి.. ఇక రెండో భాగానికి కూడా సాహసించేంత తెగువ వారికి ఉంటుందని అనుకోలేం. 

ఒకప్పటి పరిస్థితి వేరు..

ఒకప్పట్లో శేఖర్ కమ్ముల, దేవ కట్టా వంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దర్శకుల గురించి ఇండస్ట్రీలో చిత్రంగా చెప్పుకునేవారు. ప్రధానంగా శేఖర్ కమ్ముల మేకింగ్ లో చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా స్క్రిప్టు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత.. నటులను ఎంచుకుని వారితో సుమారు రెండు నెలల పాటు నాటకం లాగా రిహార్సల్స్ చేయిస్తారని చెప్పేవారు. అంత శ్రద్ధ ఉన్న ఆయనకు షూట్ చేయడం మొదలైన తర్వాత సినిమా నిడివి మీద అదుపు ఉండేది కాదు. తీసినదంతా జాగ్రత్తగా ఎడిట్ చేసేసుకుని చూసుకుంటే నిడివి మూడున్నర, నాలుగు గంటలు దాటిపోయిఉండేదిట. అప్పుడిక దానిని రెండున్నర గంటలకు కత్తిరించడానికి నానా పాట్లు పడేవారట. దేవ కట్టాకు కూడా తొలినాళ్లలో ఈ సమస్య ఉండేదని అంటారు.

అయితే ఆ దర్శకులు అప్పటికే బాగా చదువుకుని, తమ రంగాల్లో తమను మేధావులుగా ప్రూవ్ చేసుకుని, ఆసక్తి కొద్దీ సినిమా రంగంలోకి వచ్చారు. వారు ఎంత మేధావులైనా.. వారికి ఇప్పుడున్న దర్శకుల తెలివితేటలు లేవు. నిడివి ఎక్కువ వచ్చేస్తే.. మరో అరగంట కొత్త సీన్లు రాసుకుని, ప్యాచ్ వర్క్ లాగా షూట్ చేసి.. రెండు భాగాలుగా విడుదల చేయవచ్చుననే ఆలోచన వారికి అప్పట్లో రాలేదు అనుకోవాలి. లేకపోతే ఇలాంటి వంచనాత్మక సంస్కృతి మనకు ఎప్పుడో మొదలైపోయి ఉండేది. వారు తమ విజయవంతమైన చిత్రాలను ఒక్కో భాగంగానే చేశారు. 

మాయా మోసాల్లో ఇదొక తీరు

పార్ట్ 2 లేదా సీక్వెల్ అనడంలో ఇంకో మాయ కూడా ఉంది. సీక్వెల్ తీస్తాం అని విడుదలకు ముందే ప్రకటిస్తే అది ఇంకా పెద్ద వంచన అనుకోవాలి. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది.. దీనికి సీక్వెల్ కూడా చేయబోతున్నాం అని చెప్పారంటే.. ఈ సినిమా చెత్తగా తయారైందని, సీక్వెల్ కూడా తీసేంత నమ్మకంతో మేకర్స్ ఉన్నారని మాయచేస్తూ ఓపెనింగ్ టికెట్లు అమ్ముకోడానికి ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని తెలుసుకోవాలి. 

చంద్రముఖి 2 తర్వాత 3, స్కంధ, పెదకాపు 1 లకు ప్రకటించిన సీక్వెల్ మాయమాటలు ఇలాంటివే. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరచి చీదేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఇదే తరహా సినీమోసం గతంలో ఇంకో తరహాలో ఉండేది. ఒక సినిమా చెత్తగా తయారైన తర్వాత.. అదేదో అద్భుతంగా వచ్చిందనే భ్రమ కల్పించడానికి విడుదలకు ముందు నిర్మాత, దర్శకుడు లాంటి కీలక వ్యక్తులు ఉమ్మడి ప్రకటనలు చేస్తుండేవాళ్లు. 

‘ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందంటే.. ఈ సినిమాలో టీమ్ మధ్య కెమిస్ట్రీ ఎంత గొప్పగా వర్కవుట్ అయిదంటే.. ఇది విడుదలైన వెంటనే.. ఇదే టీమ్ తో మరొక చిత్రం చేయబోతున్నాం’ అని ప్రకటిస్తారు. అక్కడికేదో.. ఈ సినిమా సూపర్ అనే ఫీలింగ్ ను ప్రేక్షకులకు కలిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ జాగ్రత్తగా నెమరువేసుకుంటే.. అలా ప్రకటించిన సినిమాలు కనీసం సెట్స్ మీదకు వెళ్లిన దాఖలాలు కూడా లేవు. కేవలం ప్రేక్షకులను మాయచేసి టికెట్లు అమ్ముకోవడానికి మాత్రమే ఆ మాటలు వదులుతుంటారు. 

ఎలా దారి తప్పుతున్నారు అసలు?

ఈ రెండు భాగాలు అనే వ్యవహారం ప్రధానంగా పెద్ద హీరోల భారీ చిత్రాలకు మాత్రమే వచ్చే సమస్య. ఒక కథను కథగా కాకుండా, అందులోని గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ తో కలిపి వినిపిస్తే తప్ప.. నిర్మాతను రంజింపజేయలేని రోజులు ఇవి. చాలా సాధారణమైన సన్నివేశంలో హీరో మొహం మీద నీళ్లు చిలకరించాలని స్క్రిప్టులో ఉంటే.. ఆ పనిచేసి.. తర్వాత ఆ నీళ్లు అతని మొహమ్మీద పడి చిప్పిలి మళ్లీ నలుదిక్కులకు ఎగిరినట్లుగా క్లోజప్ లో గ్రాఫిక్స్ చేసి చూపించాలని ప్లాన్ చేసుకోవడం అనేది.. బడ్జెట్ పెంచుకోవడానికి ఒక ఫ్యాషనబుల్ మార్గంగా తయారైంది. 

ఒక దర్శకుడు మూడు వందల కోట్ల సినిమా తీశాడంటే.. నేనేం తక్కువ తిన్నానా అని.. నాలుగొందల కోట్ల బడ్జెట్ అని ముందు ప్రకటించేసి.. అంత డబ్బు  ఎలా ఖర్చు పెట్టగలమా.. అని దానికి తగ్గట్టుగా సన్నివేశాలు, బిల్డప్పులు రాసుకుంటున్న దుర్మార్గమైన మేకింగ్ నడుస్తున్న రోజులివి.

దర్శకుడు , నిర్మాతకు ఏ మూడు వందల కోట్ల బడ్జెట్ చెప్పి ఒప్పించాడని అనుకుందాం. రెండు షెడ్యూళ్లకే అది కాస్తా దాటిపోతుంది. అప్పుడు దర్శకుడి మాస్టర్ మైండ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. రెండు భాగాల తెలివితేటలు ప్రాజెక్టులోకి చొరబడతాయి. ‘నన్ను నమ్మండి సార్.. 400-450లో మొత్తం పూర్తిచేద్దాం.. కాస్తా కథ పెంచుకుంటే.. రెండు భాగాలు చేస్తే.. రెండు సార్లు విడుదల.. టోటల్ గా రెండుసార్లు టికెట్లు అమ్ముకుంటాం.. మొత్తం మీకు ఏడెనిమిది వందల కోట్ల బిజినెస్..’ అని ఊరించే మాటలు అలవోకగా ప్రవహిస్తాయి. 

నిజానికి చేయిదాటిపోయిన బడ్జెట్ గురించి, దర్శకుడి తీరు గురించి అప్పటికే నిర్మాతకు వణుకు పుడుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఈ మాటలు కొంత సాంత్వన కలిగిస్తాయి. నవనీతలేపనంలా పనిచేస్తాయి. ఎంతైనా సినిమా అంటేనే బిజెనెస్ కదా! పైగా అప్పటికే తొలుత చెప్పుకున్న ‘రోజా’ ఉదాహరణలాగా గత్యంతరంలేని స్థితిలో ఊబిలో సగం మునిగి ఉన్నాడాయె. రెట్టింపు లాభం గిట్టు బాటు అవుతుందనే ఆశ ఊరిస్తుంటుంది. అప్పుడిక రెండు భాగాలకు ఒప్పుకుంటారు. కథలను మార్చి వండడం మొదలవుతుంది. 

ఇది చేతగానితనం, వంచన!

కొంత షూటింగ్ అయిన సినిమాను రెండు భాగాలుగా చేయడం అనేది దర్శకుడి చేతగానితనం, అతడు చేస్తున్న వంచనగా గుర్తించాలి. రెండున్నర గంటల కోసం ఎంతో కసరత్తు తర్వాత సిద్ధం చేసుకున్న కథ.. కొంత షూటింగ్ తర్వాత.. హఠాత్తుగా అయిదు గంటల కథగా ఎలా అనిపిస్తుంది? అనేది ఆశ్చర్యకరం. ఒకే కథని ప్రేక్షకుడికి రెండుసార్లుగా అమ్మి అతిగా లాభపడాలనే ప్రయత్నం. ఆ రకంగా ప్రేక్షకుడిని ఇది మోసం చేయడం అవుతుంది.

మన దర్శకులు ఘనమైన వాళ్లు, ప్రతిభావంతులు కాదని అనలేం. కానీ.. ముందస్తు ప్లానింగ్ లేకుండా రెండు భాగాల సినిమాకు వెళ్లడం మాత్రం వారి చేతగానితనమే. నిజంగా కథను ప్రేమించి, అయిదు గంటలు చెబితే తప్ప నేను న్యాయం చేయలేను అనే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్న దర్శకులు.. బాహుబలి నుంచి ఓజీ దాకా ఎవ్వరైనా ఉన్నారా? ఉంటే.. వారు సినిమాకు తొలి టెంకాయ కొట్టకముందే ఇది రెండు భాగాలు అని ప్రకటించి ఉండేవారు. అలా ఎవ్వరూ చేయలేదు. ఆపద్ధర్మంగా పెరిగిపోయిన ఖర్చులను కాచుకోవడానికి.. వేస్తున్న నాటకాలు ఇవి. ఒక సగటు ప్రేక్షకుడిగా మనం మంచి సినిమాలు కోరుకుంటాం.. ఒక్కొక్కటి ఇంచుమించు గంట నిడివితో ఏడు భాగాలుగా సాగిపోయే ఓటీటీ  సిరీస్ ను చూడడం కూడా మనం అలవాటు చేసుకుంటున్నాం. 

ఈ రెండు భాగాల చిత్రాలు కూడా అలాంటి సిరీస్ లాంటివనే చులకన అభిప్రాయాన్ని.. ఇలాంటి వంచనాత్మక ‘మిడిల్ టర్న్’ దర్శకుల ప్రయత్నాలు ప్రేక్షకుల్లో కలిగిస్తే ఇండస్ట్రీకి అది చాలా పెద్ద దెబ్బ. ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు, ఇలాంటి రెండు భాగాల భారీ దర్శకులు ఒకవిషయం తెలుసుకోవాలి. ‘నిజంగా కథనే నమ్మి, వక్ర ప్రయోగాలు, మధ్యంతర  మార్పు చేర్పులు లేకుండా ఆ కథను ప్రేమించి.. మీరు ఎన్ని భాగాలుగా అయినా తీయండి. హర్షించి ఆదరించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. 

..ఎల్. విజయలక్ష్మి