బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి ట్రయిలర్ వచ్చేసింది. ఈ సినిమా మీద మొదటి నుంచీ ఓ అనుమానం వుంది. అనిల్ రావిపూడి స్టయిల్ వేరు. బాలయ్య స్టయిల్ వేరు. ఎవరి స్టయిల్ లోకి ఎవరు వస్తారా? అన్నదే అనుమానం. గమ్మత్తుగా ట్రయిలర్ ఈ రెండు విషయాలను పక్కన పెట్టింది. అనిల్ రావిపూడి.. బాలయ్య ఇద్దరూ కొత్త జానర్ లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది.
పెద్దరికం సంతరించుకున్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపించారు. ఆరంభం నుంచి చివరి వరకు ఒకటే విధంగా మిడిల్ ఏజ్ లుక్ లోనే కనిపించారు. కూతుర్ని బలంగా, పోరాటసన్నద్ధంగా తయారు చేసి తీరాలనే సంకల్పం సబ్జెక్ట్ లో కీలకంగా కనిపిస్తోంది. అంటే దాని వెనుక ఏదైనా విషయం వుంటుంది. అది సినిమాలో చూడాలన్నది అసలు సంగతి కావచ్చు.
అలాగే విలన్ తో బాలయ్యకు పేచీ దేనికి అన్నది ట్రయిలర్ లో క్లారిటీ ఇవ్వలేదు. పైగా ట్రయిలర్ మొత్తం హీరో, విలన్, శ్రీలీల మీదనే రన్ చేసారు. డ్యూయట్ల లాంటి రొటీన్ స్టఫ్ కు చోటివ్వలేదు.
మొత్తం మీద ట్రయిలర్ బాలయ్య తరహా యాక్షన్ ను మార్చలేదు..ఇంటెన్స్ సీన్లను మార్చలేదు. కానీ అసలు బాలయ్యనే కొత్తగా చూపించే ప్రయత్నం చేసింది. కథను పెద్దగా రివీల్ చేయకుండా కట్ చేసిన భగవంత్ కేసరి సినిమా ఈనెల 19న విడుదల అవుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది.