హడావిడి ఎక్కువ చేస్తే అనుమానించాల్సిందేనా?

ప్రచారంలో కూడా ఇప్పుడు కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మరీ హడావుడి ఎక్కువ చేస్తే అనుమానించే రోజులొచ్చాయి. తాజాగా రిలీజైన సినిమాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. రూల్స్ రంజన్ సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు చేసిన…

ప్రచారంలో కూడా ఇప్పుడు కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మరీ హడావుడి ఎక్కువ చేస్తే అనుమానించే రోజులొచ్చాయి. తాజాగా రిలీజైన సినిమాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. రూల్స్ రంజన్ సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. లిరికల్ సాంగ్స్ రిలీజ్ నుంచి విడుదల ముందు రోజు వరకు చేసిన హడావుడి అందరం చూశాం.

అప్పుడే కొంతమందికి అనుమానాలొచ్చాయి. కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్స్ లో ఉంటుందనే సామెతను నిజం చేస్తూ రూల్స్ రంజన్ సినిమా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. ఇంత హడావుడి చేసింది ఈ సినిమా కోసమా అనిపించింది.

మామా మశ్చీంద్ర విషయంలో కూడా ఇదే జరిగింది. ఉన్నట్టుండి సడెన్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి, ఆ వెంటనే ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీళ్లు చెప్పిన మాటలు విన్నప్పుడే చాలా అనుమానాలు కలిగాయి. రిలీజ్ తర్వాత ఆ అనుమానమే నిజమైంది.

స్కంద విషయంలో కూడా ఇదే జరిగినప్పటికీ, విడుదలకు ముందు మాత్రం ఎవ్వరూ పెద్దగా అనుమానించలేదు. ఎందుకంటే, ఇది బోయపాటి సినిమా. పైగా రామ్ తోడయ్యాడు. ఇద్దరి కాంబినేషన్ పై కొన్ని అంచనాలున్నాయి. కానీ ప్రచార ఆర్భాటం చూస్తే మాత్రం రెగ్యులర్ గా సినిమాలు ఫాలో అయ్యేవాళ్లకు అనుమానం కలిగింది. ఇప్పుడదే అనుమానం నిజమైంది. రామ్ కెరీర్ లో వరుసగా రెండో ఫ్లాప్ గా నిలిచింది స్కంద.

మంత్ ఆఫ్ మధు, చిన్నా సినిమాలది కూడా ఇదే పరిస్థితి. నేను ఇంతకంటే బెటర్ గా సినిమా తీయలేను అన్నాడు సిద్దార్థ్. కానీ చిన్నా సినిమాను అంతకంటే బెటర్ గా తీయొచ్చంటున్నారు ఆడియన్స్. ఎమోషనల్ సీన్స్ ను మాత్రమే లైక్ చేశారు. 

అటు మంత్ ఆఫ్ మధు సినిమాది కూడా సేమ్ సిచ్యుయేషన్. స్వాతితో సహా యూనిట్ అంతా దీన్నొక అద్భుతంగా చెప్పుకొచ్చారు. కల్ట్ అనే పదం వాడకుండానే, ఆ అర్థం వచ్చేలా మాట్లాడారు. కట్ చేస్తే, మంత్ ఆఫ్ మధు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ప్రచారంలో అతి కనిపిస్తే అనుమానించే పరిస్థితికి చేరుకున్నాడు సగటు ప్రేక్షకుడు.