ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు ప్రాణాపాయ ముప్పు తప్పింది. ఇవాళ మధ్యాహ్నం 11 గంటలకు ఆయన కాన్వాయ్‌పై ఆకతాయి డిటోనేటర్‌తో దాడికి పాల్పడ్డాడు. అయితే డిటో నేటర్ లక్ష్యం తప్పి, పక్కనే ముళ్లపొదల్లో పడింది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
గోరంట్ల మండలం గడ్డం తాండా వద్ద గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆకతాయి ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరాడు. దానికి పవర్ లేకపోవడంతో పేలలేదు. గురి తప్పి, ముళ్ల పొదల్లో పడింది. మొత్తానికి ప్రమాదం తప్పింది.
గోరంట్ల సీఐ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ నిందితుడు వెంకటేశ్‌ది సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి వాసిగా గుర్తించామన్నారు. దినసరి కూలీగా పని చేస్తున్నాడని చెప్పారు. గ్రానైట్ తవ్వకాల్లో భాగంగా పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్‌ను మద్యం మత్తులో విసిరాడని చెప్పారు. కుట్ర కోణంపై విచారిస్తామన్నారు.
ఇదిలా వుండగా ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడుతూ తనపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి వుందన్నారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానన్నారు. డిటోనేటర్ పేలి వుంటే ఘోర ప్రమాదం జరిగి వుండేదని వాపోయారు. తనపై ప్రజాదరణ చేసి ఓర్వలేకే హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.