చంద్రబాబు అరెస్ట్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉండడం టీడీపీకి ఒక పీడకల. బాబు జైలు జీవితాన్ని టీడీపీ, ఎల్లో మీడియా లెక్కిస్తున్నాయి. ఇప్పటికి బాబు 30 రోజులుగా జైల్లో ఉన్నారంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పుడొస్తారో తెలియని ఆయోమయ పరిస్థితి. బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. అలాగే బాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులు సోమవారం తీర్పులు వెలువరించనున్నాయి. దీంతో సోమవారం టీడీపీకి అత్యంత ప్రాధాన్యం ఉన్న రోజు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వ్యవస్థల్లో బాబుకున్న పలుకుబడి తెలిసిన ప్రజానీకం… ఒకట్రెండు రోజుల్లో ఆయన బయటికి వస్తారని అంతా ఊహించారు. అబ్బే… అలా జరగలేదు. ఒకటి, రెండు, మూడు…. ఇలా లెక్కిస్తూ పోతే 30వ రోజుకు చేరింది. జైలు నాలుగ్గోడల మధ్యే బాబు ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడుపుతుంటే, బయట ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి వుంటున్నారు. జైల్లో బాబుకు సరైన వసతి సౌకర్యాలు కల్పించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి రోజులొస్తాయని చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులెవరూ ఊహించలేదు. బాబు అరెస్ట్ కావడం, నెల రోజులు జైల్లో ఉండడం అంటే సామాన్య విషయం కాదని సాధారణ ప్రజలు సైతం అంటున్నారు. కేసులో బలం వుంటేనే బాబుకు బెయిల్ రాలేదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజంగా బాబు అవినీతికి పాల్పకపోతే ఇంత కాలం ఆయనకు న్యాయ స్థానాల్లో ఉపశమనం ఎందుకు లభించలేదనే ప్రశ్నకు సరైన సమాధానం కొరవడింది.
చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి సరిగ్గా ఈ రోజుకు నెలైంది. గత నెల 9న ఆయన్ను అరెస్ట్ చేశారు. 10న ఏసీబీ కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంటే నెల రోజులుగా ఆయన పూర్తిగా సీఐడీ, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టైంది. వరుసగా రెండుసార్లు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. తనను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట చంద్రబాబు వాపోయారు.
రిమాండ్ ఖైదీలో మాత్రమే ఉన్నారని, నేరం చేసినట్టు కాదని, దీన్ని శిక్షగా భావించొద్దని మాటలతో బాబును జడ్జి ఊరడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, టీడీపీ భవిష్యత్ రేపటి తీర్పులపై ఆధారపడి వుంది. సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. అక్కడ బాబుకు అనుకూల తీర్పు రాకపోతే కష్టకాలమే అని చెప్పక తప్పదు.