సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ మనుసింఘ్వీ.. ఇంకా ఎవరో దూబే నట! తెలుగుదేశం ఆస్థాన లాయర్ దమ్మాలపాటి ఎలాగూ ఉండనే ఉన్నారు! తొలి రోజు వియజయవాడ ఏసీబీ కోర్టులో సుమారు నలభై మంది న్యాయవాదులు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వాదనలకు సిద్ధం అయ్యారట! వారందరినీ చూసి.. న్యాయమూర్తి విస్తుపోయి, ఇద్దరికి మాత్రమే అనుమతినిస్తూ మిగతా వాళ్లను కామ్ గా ఉండమన్నారనే వార్తలు వచ్చాయి!
అక్కడ నుంచి చంద్రబాబు కోసం పేరున్న లాయర్ల పేర్లు ఒకదాని తర్వాత మరోటి వినిపిస్తూనే ఉన్నాయి! వీళ్లంతా అల్లాటప్పా న్యాయవాదులు కాదు, దేశంలోనే పేరున్న లాయర్లు! ఒక్కోరికీ హిస్టరీ బుక్స్ కు ఉన్నంత చరిత్ర ఉంది! ఎక్కడెక్కడో విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని వచ్చిన వాళ్లు.
రాజకీయాల్లోనూ ఉన్నారు! వీళ్లు అనుకుంటే.. రాజ్యసభ సభ్యత్వాల ఆఫర్లే వెల్లువెత్తుతాయి! ఇక గంటకు కోటి, కోటిన్నర రూపాయలు వీరి మినిమం చార్జ్ అనేది అతిశయోక్తి కాదు! మరి ఇంతమంది లాయర్లు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నా.. మొదటి రోజు నుంచే ఇలాంటి వాళ్లు రంగంలో ఉన్నా.. నెల రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు బయటకు రాలేకపోతున్నారు! ఆ లాయర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఎటొచ్చీ కేసులో పాయింట్లు చంద్రబాబు అనుకూలంగా లేకపోవడం వల్లనే వాళ్లు కూడా ఏం చేయలేకపోతున్నారని అనుకోవాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక పచ్చ చానళ్లలో ఆ లాయర్లు కాకుండా.. వీళ్ల దగ్గర వాదించే వాళ్లు కోర్టుకు వెళ్లి ఉంటే చంద్రబాబుకు ఈజీగా బెయిల్ వచ్చేదని వాపోతున్నారు! పచ్చ చానళ్లలో వాదించే కొంతమంది నల్లకోట్లకు ఆ చానళ్ల ప్రతినిధులు ఇలా కితాబిస్తున్నారు.
లూథ్రాలూ, సాల్వేలకు బదులు వీళ్లు వాదించి ఉంటే చంద్రబాబు ఎప్పుడో బయటకు వచ్చేవారని పచ్చ టీవీల వాళ్లు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అయినా వారు పచ్చ చానళ్లలో అలా వాదించేసి, అక్కడే తీర్పులు ఇచ్చేసుకుంటే సరిపోదా.. ఇక ఎందుకు కోర్టులు, జడ్జిమెంట్లు?