తెలుగుదేశం పార్టీకి నిరసనలను తెలపడంలో కూడా కొత్తదనం లేకుండా పోతోంది. ఎంతసేపూ ఎవడో ఒకడిని కాపీ కొట్టడమే తన విజనరీగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ఈ మధ్యనే చంద్రబాబు గ్యారెంటీ అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్ లను కాపీ కొట్టే ప్రకటనలు ఏవో చేశారు! కాంగ్రెస్ గ్యారెంటీ అంటూ .. కర్ణాటకలో కాంగ్రెస్ హిట్టు కొట్టింది.
దాన్ని కాపీ కొడుతూ మీ భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ అంటూ నినాదాన్ని అందుకుంటున్న సమయంలో సరిగ్గా చంద్రబాబు అరెస్టయ్యారు. తన భవిష్యత్తుకు గ్యారెంటీ లేని చంద్రబాబు ప్రజలకు గ్యారెంటీ ఇస్తాననడం, అది కూడా కాపీ కొట్టిన కాంగ్రెస్ నినాదం కావడం గమనార్హం!
ఆ సంగతలా ఉంటే.. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం అప్పుడు స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఇంటి బయటకు వచ్చి కొట్టాలనే పిలుపు ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంను ముప్పు తిప్పలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, తీరా ఆయననే కాపీ కొట్టి.. ప్లేట్లు, తట్టలతో రోడ్ల మీదకు వచ్చింది. ఎంతమంది సామాన్యులు వాటితో వచ్చారో కానీ.. చంద్రబాబు ఫ్యామిలీ మాత్రం ఆ పాట్లు పడింది!
ఇక చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఇంట్లో లైట్లు ఆర్పాలి, వీధిలో లైట్లను పగలగొట్టాలనే ఉద్యమమూ అయ్యింది. మరి దీని ప్రభావం కూడా ఏం ఉన్నట్టుగా లేదు. ఎంతమంది టీడీపీ వీరాభిమానులు ఇంట్లో లైట్లను ఆపి చీకట్లో కూర్చున్నారో మరి! కనీసం చంద్రబాబు కులపోళ్లు అయినా.. కాసేపు లైట్లు ఆపి అన్ ప్లగడ్ ఉద్యమం ఎంత మేరకు చేశారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
అయినా చంద్రబాబు అరెస్టయ్యి.. దాదాపు నెల కావొస్తోంది. చంద్రబాబు అరెస్టును కోర్టులు తప్పు పట్టలేదు! న్యాయం కోసం సుప్రీం వరకూ వెళ్లారు కదా! రిమాండ్, కస్టడీలు కూడా కోర్టులు విధిస్తున్నవే తప్ప జగన్ ప్రభుత్వం వాటిని విధించడం లేదు! మరి ప్రజలకు ఈ మాత్రం తెలీదని తెలుగుదేశం పార్టీ ఔట్ డేటెడ్ ఐడియాలతో మరింత కామెడీ అవుతోందా!