ఏపీ మంత్రి ఆర్కే రోజాపై తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై ఆమె సహచర నటీమణులు ఒకరి తర్వాత మరొకరు స్పందిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ, రాధిక.. ఇలా ఒకరి తర్వాత ఒకరు బండారుపై విరుచుకుపడుతున్నారు.
హీరోయిన్లు అంటే అంత చులకనా.. అనే తత్వంతో వారు విరుచుకుపడుతున్నారు. ఈ జాబితాలో ఎంపీ నవనీత్ కౌర్ కూడా ఉంది. ఒకవైపు పార్లమెంట్ లో మహిళా కోటా బిల్లుకు ఆమోదం పొందిన వేళ ఇలా రాజకీయాల్లోని మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ వారు విలువైన ప్రశ్ననే వేస్తున్నారు!
మరి తాము ఏం మాట్లాడినా చెల్లుతుందని, మహా అంటే అరెస్టు జరిగి సాయంత్రానికి బయటకు వస్తామని, తమకు వ్యతిరేకులపై తాము ఏమైనా మాట్లాడగలమని.. తమ చేతిలో మీడియా ఉంది కాబట్టి, తమ కులపోళ్లు తిమ్మినిబమ్మి చేసి చూపించగలరనే అహంభావపూర్వకమైన ధోరణితో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల తీరును ఎండగడుతున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం!
నిజంగా తనకూ ఒక కుటుంబం ఉంటే.. బండారు లాంటి వాళ్లు సిగ్గుపడే రీతిన ఉంది నటీమణుల స్పందన. చెప్పుతో కొట్టకపోయినా.. ఛీ కొడుతూ చెప్పుతో కొట్టిన స్థాయిలో ఆ మహిళలు స్పందిస్తున్నారు. ఒక మాజీ మంత్రి అట ఈయన, మరి ఆ నేపథ్యంతో ఏదో గుర్తింపు దక్కే ఉంటుంది కదా, కనీసం ఇంటి పెద్దగా అయినా గౌరవం ఉండి ఉంటుంది కదా! మాట్లాడే మాటలు అలాంటి గౌరవాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి కానీ, ఇంట్లో వాళ్లు కూడా తలదించుకునేలా ఉండకూడదు! అందునా మాజీ మంత్రివి అయిపోతివి, ఇంకా రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాడివి కూడా!
యూట్యూబ్ లోనో ఇంటర్నెట్ లోనో.. ఎవరో ఒకరు ఎవరి పేరుతోనే వీడియోలు పెడితే .. అవి వారు నటించినవి అవుతాయా! నకిలీ వ్యవహారాలను, డీప్ ఫేక్ లను కూడా వాడుకునేంత ధైన్యస్థితిలో తెలుగుదేశం ఉందా! రాజకీయ ప్రత్యర్థులపై మాటలదాడి అంటే ఇదా! మరి ఇంకా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉంది, ఆ లోపు టీడీపీ ఇంకా ఎంత వరకూ దిగజారుతుంది! ఇంకా చెప్పుదెబ్బల్లాంటి వాటిని ఇంకా ఎన్ని తింటుంది?