ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణుడిగా జీవీ రావు ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్ అయ్యారు. మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో అవుతుందంటూ ఆయన చెప్పడం, దాన్నే తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక ముద్రించడంతో రాజకీయ దుమారం రేపింది. జీవీరావుపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ రేంజ్లో ట్విటర్ వేదికగా సెటైర్స్ వేశారు. జీవీరావును ఓ కమెడియన్‌గా చిత్రీకరిస్తూ వివిధ రూపాల్లో ఆయన్ను ఆవిష్కరించడం విశేషం.
ఈ సందర్భంగా జీవీరావుకు ఆర్జీవీ చాలెంజ్ విసిరారు. కనీసం పది శాతం దమ్మున్నా తాను నిర్వహిస్తున్న డిబేట్‌కు రావాలని జీవీరావును ఆయన కోరడం గమనార్హం. అలాగే ఇందులోకి చంద్రబాబును కూడా తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అంతటి స్టార్‌ను చంద్రబాబు చేస్తారని జీవీరావుపై పంచ్‌లు విసిరారు. ఆర్జీవీ ట్వీట్లలో ఏముందో చూద్దాం.
“జీవీ రావు, నిన్ను ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ గా గౌరవిస్తున్న 40 ఇయర్స్‌కి నీ డాన్స్ టాలెంట్ తెల్సా? ఆయనకున్న ఫిలిం కాంటాక్ట్స్‌తో నిన్ను తారక్‌రత్న కన్నా పెద్ద స్టార్ చేస్తారు. హే జీవీరావు నీకున్న డాన్స్ టాలెంట్‌లో పది శాతం దమ్మున్నా #Nijam ఛానల్లో AP ఫైనాన్స్ సిట్యుయేషన్ గురించి మాట్లాడటానికి ఇంటర్వ్యూకి రా” అని వేర్వేరు ట్వీట్లు చేశారు.
ఈ సందర్భంగా జీవీరావు డ్యాన్స్ చేస్తున్నట్టు క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మేధావులు, ఎల్లో మీడియాకు ఆర్జీవీ కొరకరాని కొయ్యగా మారారు. వైసీపీ కంటే పదునైన కౌంటర్లు ఆర్జీవీ నుంచి రావడం గమనార్హం. పవన్‌కల్యాణ్‌పై ఆర్జీవీ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.