జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతన్నాడు, ఇంతన్నాడు…. చివరికి చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధమయ్యాడనే ఆవేదన ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కనిపిస్తోంది.
తన ఓటు బ్యాంక్ కేవలం కాపు సామాజిక వర్గమే అని పవన్‌కు బాగా తెలుసు. ఆ బలాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని పవన్ సర్కస్ ఫీట్లు వేస్తున్నారనే విమర్శ బలంగా వుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కాపులు, బలిజలు సంతోషించారు.
తమకంటూ ఒక నాయకుడు, పార్టీ రావడాన్ని స్వాగతించారు. రాజకీయాలు కులాల పరంగా విడిపోయాయనేది వాస్తవం. వైసీపీ, టీడీపీలకు ఆధిపత్య కులాలకు చెందిన నాయకులు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో సహజంగా సంబంధిత వ్యక్తులు తమ పార్టీగా చెప్పుకుంటుంటారు. అలాగని తమ కులాలకు ప్రాధాన్యం ఇవ్వరు. ఓట్ల కోసమైనా సొంత కులాల కంటే అణగారిన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఏపీలో కాపుల ఓటు బ్యాంక్ బలంగా వుంది. దాదాపు 14 నుంచి 15 శాతం కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలున్నాయి. బీసీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన తమ నుంచి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష వారిలో చాలా కాలంగా వుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టడంతో కాంగ్రెస్, టీడీపీలలో వణుకు పుట్టింది. ప్రజారాజ్యం స్థాపించిన మొదట్లో చిరంజీవి సభలకు జనం వెల్లువెత్తడాన్ని చూసి, కనీసం 50 చోట్ల గెలవొచ్చనే ప్రచారం జరిగింది. అయితే 18 సీట్లకే మాత్రమే పీఆర్పీ పరిమితమైంది.
వైఎస్సార్ మరణానంతరం ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారాయి. వైఎస్ జగన్ సొంత కుంపటి పెట్టుకోవడంతో ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్‌కు పీఆర్పీ అవసరం ఏర్పడింది. చివరికి కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేయాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పీఆర్పీని స్థాపించి ఎన్నికల బరిలో మెగాస్టార్ నిలిచారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు దీటుగా ఆయన ఎదురొడ్డి పోరాడారు. చిరంజీవి నాడు పోరాట స్ఫూర్తి కనబరిచారు.
కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ పరిస్థితి అన్న చిరంజీవి వైఖరికి పూర్తి విరుద్ధంగా సాగుతోంది. ప్రశ్నించడానికే పార్టీ అని, కులమతాలు లేని రాజకీయాలు, ఇంకా ఏవేవో ఆశయాలతో జనసేనను స్థాపించానని పవన్ మాటలు కోటలు దాటేలా చెప్పారు. కానీ జనసేన బలోపేతానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ కూటమి అధికారంలోకి రావడానికి విశేష కృషి చేశారు.
2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పొత్తు కుదుర్చుకున్నారు. తాను నిలిచిన రెండు చోట్ల ఓడిపోయారు. కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు. 2024లో పొత్తులతో బరిలో దిగుతానంటున్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేనని బహిరంగంగా ప్రకటించారు. తాను సీఎం అభ్యర్థిని కాదని తేల్చి చెప్పారు. సీఎం జగన్‌ను గద్దె దించడం తప్ప, తనకు ఏ లక్ష్యం లేదని స్పష్టం చేశారు. పవన్‌ను సీఎంగా చూడాలన్న కాపుల ఆశ గోవిందా. అసలు జనసేనను ఎందుకు స్థాపించారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.
తమ నాయకుడిగా ఏదో ఉద్ధరిస్తాడని ఇంత కాలం అనుకున్నామని, తీరా ఇప్పుడు చంద్రబాబు పల్లకీ మోయాలని పవన్ చెప్పడం చూసి సిగ్గుపడుతున్నామని ఆయన సామాజిక వర్గ నేతలు వాపోతున్నారు. ఈ సంబరానికి తమనెందుకు బలి పెట్టాలని అనుకున్నాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పవన్‌తో పోల్చితే చిరంజీవి వేల రెట్లు గొప్పోడని కాపు నేతలు అంటున్నారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి, హేమాహేమీలైన చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలతో తలపడ్డారని గుర్తు చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం పోరాట స్ఫూర్తి కనబరచకుండానే ప్రత్యర్థుల ప్యాకేజీ విమర్శలకు బలం చేకూర్చేలా టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
భవిష్యత్‌లో మరెవరైనా కాపు నాయకుడొస్తే నమ్మలేని పరిస్థితిని పవన్ సృష్టించారని విమర్శిస్తున్నారు.